బీజేపీ కోసమే పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫోకస్ పెట్టారా?
తెలంగాణలో కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ నవ నిర్మాణ సభ ఏర్పాటు చేసింది. దానికి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించింది. అయితే అంతకుముందే నాగేశ్వర్ ఇష్యూ నడుస్తూ ఉండడం, ఇరు పక్షాల మధ్య వాదోపవాదనలు బలంగా నడుస్తూ ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. అటు హైకోర్టు కూడా ఈ సమావేశానికి అనుమతి నిరాకరించింది.
అదే రోజు పవన్ కల్యాణ్ తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా మాట్లాడారు. తనను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారని, ఇదేమైనా వాళ్ల అయ్య జాగీరా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ తెలంగాణపై దృష్టి పెట్టాలనే ఆలోచన రాలేదని, కానీ తెలంగాణలో కూడా పోటీ చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నానని ప్రకటించారు. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫోకస్ చేయడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి కోసమే పవన్ కల్యాణ్ ఇలా పని చేస్తున్నారని చెప్తోంది. అయితే పవన్ కల్యాణ్ పై యుద్ధ భేరి మోగించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలే పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకుంటున్నారు. జనసైనికుల్లో ఆగ్రహం రావడానికి కాంగ్రెస్ నేతల మాటలే కారణం.
అయితే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇస్తున్నారని కొంతమంది అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్ర ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇన్నాళ్లూ వాళ్లంతా బీఆర్ఎస్ వైపు నడిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ల ఓట్లను రాబట్టుకునేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కూడా చేశారు. అయితే సీమాంధ్ర ఓట్లను పవన్ కల్యాణ్ చీల్చ గలిగితే బీఆర్ఎస్ ఎక్కువగా నష్టపోతుందని అంచనా వేస్తున్నారు. ఆ ఓట్లు పవన్ కల్యాణ్ పార్టీ లాక్కోగలిగితే, అంతిమంగా అది బీజేపీకి మేలు చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
బీజేపీ ఇప్పటికే తాము ఒంటరిగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించింది. ఒకవేళ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే సీమాంధ్ర ఓటర్లు పెద్దఎత్తున ఆ కూటమి వైపు మళ్లొచ్చు. అప్పుడు బీఆర్ఎస్ ఎక్కువ నష్టపోతుంది. కాంగ్రెస్ కొంతమేర కోల్పోవచ్చు. ఈ చీలికలో బీజేపీకి లబ్ది చేకూరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే పవన్ కల్యాణ్ తెలంగాణపై కన్నేశారని భావిస్తున్నారు.








