డీకే శివకుమార్ ప్రమాణం.. దేశంలోనే అత్యంత ‘ధనిక’ సీఎం!
కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు కొత్త శకం మొదలైంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ (DK Shivakumar) బుధవారం కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో సాదాసీదాగా జరిగిన ఈ వేడుకలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఒకచేతితో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని, తన ఆధ్యాత్మిక గురువు వీర గంగాధర అజ్జయ్య నామస్మరణతో డీకే పదవీ బాధ్యతలు స్వీకరించడం విశేషం. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు ముందు.. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం యెడ్యూరప్పలను కలిసిన డీకే శివకుమార్ వారి ఆశీస్సులు తీసుకున్నారు.
విద్యార్థులకు బంపర్ ఆఫర్..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే డీకే శివకుమార్ (DK Shivakumar) విద్యార్థులకు, నిరుద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) వరకు చదువుకునే విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్‌లు ఇస్తామని, ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తేల్చి చెప్పారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,000 ‘భారత్ జోడో యూత్ క్లబ్’లను ఏర్పాటు చేస్తామని, ప్రతి క్లబ్‌కు రూ. 10 లక్షల గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. దీనితో పాటు గ్రేటర్ బెంగళూరు పరిధిలో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 2,000 కోట్ల భారీ నిధులను కేటాయించారు.
దేశంలోనే ధనవంతుడైన సీఎం!
ఈ ప్రమాణ స్వీకారంతో డీకే శివకుమార్ (DK Shivakumar) పేరిట ఒక అరుదైన రికార్డు నమోదైంది. తన ఎన్నికల అఫిడవిట్లో రూ. 1,413 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించిన డీకే.. ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. ఉత్తర భారతదేశంలోని 10 మంది సీఎంల ఉమ్మడి ఆస్తి (రూ. 106.75 కోట్లు) కంటే కూడా డీకే ఆస్తి ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక దక్షిణ భారతదేశ విషయానికొస్తే.. రూ. 931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు రెండో స్థానంలో, రూ. 648 కోట్లతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 30 కోట్లుగా ఉంది.
కుర్చీ డీకేది.. పట్టు సిద్ధరామయ్యదే?
డీకే శివకుమార్ (DK Shivakumar) సీఎం పీఠం ఎక్కినప్పటికీ, కొత్త కేబినెట్‌ను చూస్తే ఆయన సిద్ధరామయ్య నీడలోనే పాలన సాగించాల్సి వస్తుందనే చర్చ నడుస్తోంది. డీకేతో పాటు ప్రమాణం చేసిన 13 మంది మంత్రుల జాబితాలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేతో పాటు సిద్ధూ వర్గానికి చెందిన కీలక నేతలకే పెద్దపీట దక్కింది. సీనియర్ దళిత నేత జి. పరమేశ్వర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మొదటి విడతలో మహిళలకు ఎవరికీ చోటు దక్కలేదు.
సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండిపోవడం, పైగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో స్థానం సంపాదించడంతో.. డీకే ప్రతి అడుగును ఆయన డేగకళ్లతో గమనించడం ఖాయం. పరమేశ్వర, ఎంబీ పాటిల్ వంటి సీనియర్లను సమన్వయం చేసుకుంటూ డీకే (DK Shivakumar) తన రెండేళ్ల పాలనను ఎలా సాగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేపీసీసీ చీఫ్‌గా హరిప్రసాద్
డీకే శివకుమార్ (DK Shivakumar) సీఎం కావడంతో ఖాళీ అయిన కర్ణాటక పీసీసీ (KPCC) అధ్యక్ష పదవిని కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ ఓబీసీ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌కు అప్పగించింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత కర్ణాటక కాంగ్రెస్ సారథ్యం ఒక ఓబీసీ నేతకు దక్కడం విశేషం.








