విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 10 వేల కోట్లతో కేంద్రం స్కెచ్!
పండుగ సీజన్ వచ్చినా, కాస్త అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా విమానం ఎక్కుదామంటే సామాన్యులకు టికెట్ ధరలు చుక్కలు చూపిస్తుంటాయి. దానికి తోడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రగులుతున్న యుద్ధాలతో ఆ ధరలు మరింత మండిపోతాయేమో అన్న భయం ప్రయాణికుల్లో మొదలైంది. ఇలాంటి కష్టకాలంలో విమానయాన సంస్థలను, సామాన్య ప్రయాణికులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మక అడుగు వేసింది. విమాన ఇంధన (Aviation Turbine Fuel – ATF) ధరల (ATF Rates)ను అదుపు చేసేందుకు ఏకంగా రూ. 10,000 కోట్లతో ‘ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధి’ని ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు.
ధరలు ఎందుకు పెరిగాయి?
సాధారణంగా విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులో 40 శాతం కేవలం ఈ ఇంధనానికే (ATF Rates) పోతుంది. కానీ పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎంతలా అంటే, ఈ ఏడాది మార్చి నెలలో లీటరుకు రూ. 60.50 గా ఉన్న ఏటీఎఫ్ ధర, మే నెల వచ్చే సరికి ఏకంగా రూ. 142 కు ఎగబాకింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఇంధన ఖర్చు రెండింతలు అయిపోయింది. దీనికి తోడు దాయాది దేశం పాకిస్తాన్ తన గగనతలాన్ని (Airspace) మూసివేయడం ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు కోలుకోలేని దెబ్బకొట్టింది. పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన విమానాలు ఇప్పుడు దారి మళ్లింపు కారణంగా చుట్టూ తిరిగి సుదూర మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం పెరిగి, ఇంధన (ATF Rates) వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా విమాన సంస్థల మొత్తం ఖర్చుల్లో ఇంధన భారం 40 శాతం నుంచి ఏకంగా 60 శాతానికి చేరింది. ఈ భారాన్ని తట్టుకోలేక విమానయాన సంస్థలు విలవిలలాడుతున్నాయి.
కేంద్రం 10 వేల కోట్ల స్కెచ్ ఇదే!
ఈ సంక్షోభం నుంచి ఏవియేషన్ రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం ఈ రూ. 10 వేల కోట్ల స్థిరీకరణ నిధిని వాడుకోనుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు (ATF Rates) భగ్గుమన్నప్పుడు ఆ భారాన్ని సంస్థలపై పడనివ్వకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు కేంద్రం ‘వడ్డీ లేని అడ్వాన్సులు’ ఇస్తుంది. తద్వారా విమానయాన సంస్థలకు పాత ధరకే ఇంధనం అందుతుంది. అయితే ఇక్కడ కేంద్రం ఒక లాజిక్ పెట్టింది. ఈ ప్రయోజనం పొందే విమాన కంపెనీలు రాబోయే మూడేళ్ల పాటు కచ్చితంగా ఈ ప్రభుత్వ చమురు సంస్థల నుంచే ఏటీఎఫ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సామాన్యుడికి లాభం ఏంటి?
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎయిర్‌లైన్స్ కంపెనీల నిర్వహణ ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఆ ఫ్యూయల్ భారం (ATF Rates) తగ్గితే, విమానయాన సంస్థలు ప్రయాణికులపై టికెట్ల ధరల రూపంలో అదనపు భారం మోపాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఫ్లైట్ టికెట్ల ధరలు అందుబాటులోనే ఉంటాయని, సామాన్యుడికి విమాన ప్రయాణం పీడకలగా మారకుండా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.








