భారత్ బంగారం అమ్మేస్తోందా? 12 బిలియన్ డాలర్ల పసిడిపై ఆర్బీఐ క్లారిటీ!
దేశీయ ఆర్థిక వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ గత కొన్ని రోజులుగా ఒక వార్త తీవ్ర కలకలం రేపుతోంది. దేశ విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలను కాపాడుకోవడం కోసం, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన వద్ద ఉన్న బంగారాన్ని భారీగా విక్రయించిందనేదే ఆ వార్త సారాంశం. ఏకంగా 100 టన్నుల మేర, అంటే దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన పసిడి నిల్వలను ఆర్బీఐ గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిందని అంతర్జాతీయ మీడియా దిగ్గజం ‘బ్లూమ్‌బర్గ్’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో ఆర్బీఐ ఎట్టకేలకు స్వయంగా స్పష్టతనిచ్చింది.
అదంతా అబద్ధం.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్!
బంగారం విక్రయాలంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తి అవాస్తవాలని ఆర్బీఐ (RBI) స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్ విభాగం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న పసిడి నిల్వలు సురక్షితంగా, యథాతథంగా ఉన్నాయని తేల్చిచెప్పింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న భౌతిక బంగారు నిల్వలు అక్షరాలా 880.52 టన్నులకు చేరాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ నిల్వలు తగ్గకపోగా, మరింత పెరగడం గమనార్హం. 2025 మే నెలలో ఆర్బీఐ (RBI) వద్ద 879.58 టన్నుల బంగారం ఉండగా, అది క్రమంగా పెరుగుతూ ప్రస్తుత స్థాయికి చేరింది.
తగ్గని నిల్వలు.. పెరిగిన సంపద!
ఇక్కడ విశేషం ఏంటంటే.. పరిమాణం పరంగా బంగారం పెద్దగా పెరగకపోయినా, గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో ఆర్బీఐ (RBI) వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్ విలువ అమాంతం పెరిగింది. గతేడాది కాలంలోనే ఈ నిల్వల విలువ ఏకంగా 40 బిలియన్ డాలర్లు పెరిగి, ప్రస్తుతం 120 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరింది. ఇదే సమయంలో దేశ మొత్తం విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు కూడా 658 బిలియన్ డాలర్ల భారీ స్థాయికి ఎగబాకాయి.
ఆ డాలర్ల అమ్మకం ఎందుకు?
అయితే బంగారం అమ్మలేదన్నది నిజమే కానీ, రూపాయి విలువ పడిపోకుండా కాపాడటం కోసం ఆర్బీఐ (RBI) గడిచిన ఆర్థిక సంవత్సరంలో స్పాట్ ఫారెక్స్ మార్కెట్లో నికరంగా ఏకంగా 53.13 బిలియన్ డాలర్లను విక్రయించింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగినప్పుడు, దేశీయ కరెన్సీ కుప్పకూలకుండా ఉండేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను మార్కెట్లోకి వదులుతుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బ్యాంక్ ఇంత భారీ స్థాయిలో డాలర్లను విక్రయించడం భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డాలర్ల విక్రయాన్ని చూసి కొందరు పొరపాటున బంగారం అమ్మేసారంటూ తప్పుడు ప్రచారం చేశారని, దేశ ఆర్థిక మూలాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయని ఆర్బీఐ (RBI) వర్గాలు అంటున్నాయి.








