హీరో అవుదామనుకుంటే తండ్రి పాత్రలొచ్చాయి
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత నమ్మకమైన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మురళీ శర్మ(murali sharma) ఒకరు. హీరోలకు సమానంగా ప్రేక్షకుల గుర్తింపు సంపాదించుకున్న ఆయన జర్నీ మాత్రం ఎన్నో మలుపులతో సాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మురళీ శర్మ తన కెరీర్ వెనుక ఉన్న ఆసక్తికర కథను పంచుకున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు హీరో కావాలన్నదే తన టార్గెట్ అని, కానీ అవకాశాలు రావడం మొదలయ్యే సమయానికి వయసు, పరిస్థితులు తనను తండ్రి పాత్రల వైపు మళ్లించాయని తెలిపారు. అయితే పాత్ర చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ప్రతి అవకాశాన్ని స్వీకరించడమే తన ఎదుగుదలకు ప్రధాన కారణమైందని చెప్పారు.
అవకాశాలు ఆలస్యంగా వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదల తనను నిలబెట్టిందని మురళీ శర్మ అభిప్రాయపడ్డారు. తనకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న నటులు కూడా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారని, సక్సెస్ కు టాలెంట్ తో పాటూ నిరంతర కృషి కూడా అవసరమని పేర్కొన్నారు. కెరీర్లో ఓ దశలో నటనకు దూరంగా ప్రొడక్షన్ విభాగంలో పనిచేయడంతో పాటు జర్నలిస్టుగా కూడా సేవలందించిన విషయాన్ని గుర్తుచేశారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు జర్నలిజంలో కొనసాగానని, రచనలంటే ఇప్పటికీ ప్రత్యేక ఆసక్తి ఉందని వెల్లడించారు.
తెనాలిలో జన్మించి ముంబైలో పెరిగిన మురళీ శర్మకు బాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, ఆయనకు విస్తృతమైన ఆదరణ దక్కింది మాత్రం టాలీవుడ్ ద్వారానే. భలే భలే మగాడివోయ్(Bhale bhale magadivoy), నిన్ను కోరి(ninnu kori), అల వైకుంఠపురంలో(Ala vaikunthapurramulo), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(most eligible bachelor) వంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరోగా కాకపోయినా, ప్రతి పాత్రను గుర్తుండిపోయేలా మలచగల నటుడిగా మురళీ శర్మ ఎదిగిన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది.








