సినిమా ఫెయిలైతే మూడు నెలలు బాధపడతా!
బాలీవుడ్లో కథల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, తన సినిమాల ఫలితాలను అంతే భావోద్వేగంతో తీసుకుంటానని మరోసారి నిరూపించారు స్టార్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సినిమా ఫ్లాప్ అయితే అది కేవలం బాక్సాఫీస్ పరాజయం కాదని, వ్యక్తిగతంగా తాను ఓటమిని ఎదుర్కొన్నట్టే అనిపిస్తుందని తెలిపారు. ప్రేక్షకులు టికెట్ కొనుగోలు చేసి థియేటర్‌కు వస్తే, వారికి నచ్చే అనుభవాన్ని ఇవ్వడం దర్శకుడు, నటుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోతే రెండు నుంచి మూడు నెలల పాటు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతానని చెప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
సినిమాను తాను ఒక ప్రాజెక్ట్‌గా కాకుండా, ఎమోషన్స్ తో పెంచిన పిల్లలాగా చూస్తానని ఆమిర్ వెల్లడించారు. ఒక సినిమా ప్రేక్షకుల వద్ద విఫలమైతే ఆ బాధను దాచిపెట్టకుండా బయటపెట్టాలని, అలా చేయకపోతే మళ్లీ క్రియేటివ్‌గా ముందుకు సాగలేమని చెప్పారు. షూటింగ్ దశలోనే కొన్ని సినిమాలు పూర్తిగా కనెక్ట్ కావడం లేదని అర్థమయ్యే సందర్భాలుంటాయని, ఫస్ట్ కట్ చూసిన వెంటనే తనకు తాను నిజాయితీగా ప్రశ్నలు వేసుకుంటానని తెలిపారు. ముఖ్యంగా తారే జమీన్ పర్(Taare Zameen Par), ఢిల్లీ బెల్లీ(Delhi Belly), లాపతా లేడీస్(Laapataa Ladies) వంటి సినిమాలు సరైన ఎమోషన్స్ తెరపై కనిపించేందుకు ఎడిటింగ్‌లో ఎన్నో మార్పులు చేశామని గుర్తుచేశారు.
ప్రేక్షకుల రెస్పాన్స్‌నే అసలు పరీక్షగా భావించే ఆమిర్, స్పెషల్ స్క్రీనింగ్‌ల ద్వారా ఆడియన్స్ రియాక్షన్‌ను గమనించడం తనకు అలవాటని చెప్పారు. కథ ఎలా అర్థమవుతోంది, భావోద్వేగం ఎంతవరకు చేరుతోంది అనే విషయాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని చివరి నిమిషం వరకు మార్పులు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 3 ఇడియట్స్(3 idiots) కు సీక్వెల్‌గా ప్రచారంలో ఉన్న 4 ఇడియట్స్(4 idiots) ప్రాజెక్ట్‌పై బాలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.







