ఆగస్ట్ పై టాలీవుడ్ ఆశలు
టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం ఆశలు, ఆందోళనలు కలిసి నడుస్తున్న దశలో ఉంది. ఈ ఏడాది విడుదలైన కొన్ని భారీ సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో థియేటర్లలో మళ్లీ జోష్ తీసుకురాగల సినిమా కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్(ram charan) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది(Peddi)పై ట్రేడ్ వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. జూన్ లో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా సక్సెస్ అయితేనే బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఆగస్ట్ నెల టాలీవుడ్‌కు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే సెలవులు, లాంగ్ వీకెండ్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనుకూలమైన సీజన్ కావడంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఈ టైమ్ లో ప్లాన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే నాని(Nani) నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise), శర్వానంద్(Sharwanand) నటిస్తున్న భోగి(Bhogi) సినిమాలు ఆగస్టు రిలీజ్లుగా ప్రచారంలో ఉన్నాయి. అలాగే రవితేజ(Ravi Teja)- శివ నిర్వాణ(Shiva Nirvana) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇరుముడి(Irumudi) కూడా ఇదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ క్యాలెండర్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
కొన్ని భారీ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ది ప్యారడైజ్, విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons), అలాగే చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న విశ్వంభర(Vishwambhara) రిలీజ్ డేట్లపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒక స్టార్ హీరో సినిమా డేట్ మారితే దాని ప్రభావం మొత్తం రిలీజ్ షెడ్యూల్‌పై పడుతోందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సరైన సమయంలో పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తే ఆగస్ట్ నిజంగానే టాలీవుడ్‌కు భారీ బిజినెస్ సీజన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.







