అమెరికా స్మార్ట్ షెడ్యూలింగ్ వ్యవస్థ..!
భారత్ -అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత దిశగా యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఫస్ట్ పేరుతో సరికొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌ను ప్రవేశపెడుతున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఈ నూతన విధానం ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే వ్యాపార నిపుణులకు వీసా ప్రక్రియలో ప్రాధాన్యత లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
“కొన్నిసార్లు వీసా ప్రక్రియలో జాప్యం లేదా అనిశ్చితి వ్యాపార పర్యటనలు, పెట్టుబడుల సమావేశాలు, భాగస్వామ్య ఒప్పందాల వంటి కీలకమైన కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోంది. ఈ ఇబ్బందిని తొలగించేందుకే ఈ స్మార్ట్ షెడ్యూలింగ్ వ్యవస్థను తీసుకొస్తున్నాం” అని రూబియో వివరించారు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసే దరఖాస్తుదారులకు వీసా షెడ్యూలింగ్‌లో త్వరగా అవకాశం కల్పించడమే ఈ టూల్ ప్రాథమిక సూత్రమని తెలిపారు. ముఖ్యంగా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, కార్యకలాపాలను విస్తరించడానికి, అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే భారత కంపెనీల ప్రతినిధులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత్-అమెరికా సంబంధాలు వార్తా శీర్షికల్లో కనిపించని రీతిలో ఎన్నో విధాలుగా బలపడుతున్నాయని రూబియో అన్నారు. “భారత కంపెనీల నుంచి అమెరికాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి” అని ఆయన గుర్తుచేశారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనిక విన్యాసాల ద్వారా భద్రతా భాగస్వామ్యం కూడా బలపడిందని తెలిపారు. క్రమబద్ధమైన, సురక్షితమైన కాన్సులర్ వ్యవస్థ ఈ ముఖ్యమైన బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కొత్త సౌకర్యం కేవలం వీసా దరఖాస్తుదారుల కోసమే కాదని, అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం ‘ఫ్రంట్ లైన్స్’లో పనిచేస్తున్న కాన్సులర్ అధికారులు, సిబ్బంది పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుందని చెప్పారు. “ఈ విధానం అమెరికన్ల డబ్బును ఆదా చేస్తుంది, ఎందుకంటే ఇది మమ్మల్ని మరింత సమర్థవంతంగా మారుస్తుంది. చేయాల్సిన పనిని మరింత కచ్చితంగా, వేగంగా చేయడానికి ఇది అనుమతిస్తుంది” అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి







