పాతికేళ్ల తర్వాత ఆ సూపర్‌హిట్ కాంబో
భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన లగాన్(Lagaan) సినిమాతో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసిన స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan), డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్(Ashutosh Gowariker) జోడీ మరోసారి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ సెట్స్‌పైకి రానుందన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి వీరిద్దరూ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన బయోపిక్ కోసం చేతులు కలపబోతున్నారని సమాచారం. భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన లెజెండరీ క్రికెటర్ లాలా అమర్నాథ్(Lala Amarnath) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
భారత క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా లాలా అమర్నాథ్ పేరు చిరస్థాయిగా నిలిచింది. 1933లో ఆయన నమోదు చేసిన ఆ ఘనత భారత క్రికెట్‌కు కొత్త దిశ చూపించింది. ఇప్పుడు ఆయన జీవిత ప్రయాణాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ఆశుతోష్ గోవారికర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్‌ను అమీర్ ఖాన్(aamir khan)కు వినిపించగా, కథనం మరియు ఎమోషనల్ ట్రీట్మెంట్ ఆయనను బాగా ఆకట్టుకున్నాయని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉండగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా సాగుతున్నట్లు సమాచారం.
అన్ని కార్యక్రమాలు పూర్తైతే ఈ సినిమా షూటింగ్ దసరా 2026 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు గత కొంతకాలంగా వరుస నిరాశలు ఎదుర్కొంటున్న అమీర్ ఖాన్, ఈ బయోపిక్‌తో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ(Rajkumar Hirani)తో కలిసి త్రీ ఇడియట్స్(3Idiots) సీక్వెల్‌పై కూడా అమీర్ చర్చలు జరుపుతున్నాడన్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.







