రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసం.. రూ.25 కోట్లకు పైగా ముంచేసిన కేటుగాళ్లు
Cyberabad EOW: రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, విల్లాల నిర్మాణం పేరిట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు వేర్వేరు భారీ మోసాలు వెలుగుచూశాయి. నమ్మి డబ్బులు పెట్టిన బాధితులను దాదాపు రూ. 25.10 కోట్ల మేర ముంచేసిన ఉదంతాలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు విచారణ జరిపి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రెండు మోసాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:
1.విల్లాల పేరిట ‘SVN ఆదిత్య హోమ్స్’ దగా..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో విల్లాల నిర్మాణం చేపడుతున్నామంటూ ‘ఎస్వీఎం ఆదిత్య హోమ్స్’ సంస్థ బాధితుల నుండి రూ. 15.10 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడింది. ఖానామెట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రామారావుకు 2023 అక్టోబర్‌లో ఈ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేసి, కిష్టారెడ్డిపేటలోని 9 ఎకరాల్లో విల్లాలు నిర్మిస్తున్నట్లు నమ్మించారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడంతో, ఆయన కొండాపూర్‌లోని సదరు సంస్థ కార్యాలయాన్ని సందర్శించి రెండు విల్లాలను (నంబర్ 92, 183) రూ. 1.79 కోట్లకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా 2024 ఏప్రిల్ నాటికి రూ. 80 లక్షలు చెల్లించారు. అయితే నెలలు గడుస్తున్నా అక్కడ పనులు ప్రారంభం కాకపోవడంతో రామారావు ఆరా తీశారు. తనలాగే సుమారు 20 మంది బాధితుల నుండి ఈ సంస్థ రూ. 15.10 కోట్లు వసూలు చేసి చేతులెత్తేసినట్లు తెలుసుకుని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సంస్థ భాగస్వాములు ఎన్. శ్రీనివాస్ బాబు, జూలకంటి మధుసూదన్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2.నెలవారీ లాభాలంటూ ‘NSR హైట్స్’ బోర్డు తిప్పేసింది..
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడితే నెలకు 4 శాతం చొప్పున లాభాలు ఇస్తామంటూ ‘ఎస్ఆర్ హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ప్రతినిధులు మరో రూ. 10 కోట్ల భారీ మోసానికి తెరతీశారు. నగరానికి చెందిన సులోచనారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన కంపెనీ ప్రతినిధులు బొద్దుల వాణి, బొద్దుల విజయ్, బాలమణి తదితరులు తమ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరారు. వారి మాటలు నమ్మి సులోచనారెడ్డి 2022 మే నుండి 2023 నవంబర్ వరకు విడతల వారీగా దాదాపు రూ. 10 కోట్లు సదరు కంపెనీకి చెల్లించారు. ప్రారంభంలో కొంతకాలం పాటు నిందితులు నెలకు 4 శాతం చొప్పున లాభాలు ఇచ్చి ఆ తర్వాత నిలిపివేశారు. దీనిపై నిలదీసేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో వాణి, విజయ్‌ల నివాసానికి వెళ్లిన సులోచనారెడ్డిని వారు తీవ్రంగా బెదిరించారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు బొద్దుల విజయ్, వాణి, అజయ్, బాలమణి, సతీష్, రాజేష్‌లపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







