ఆటా సాంస్కృతిక, అందాల పోటీలు సూపర్ సక్సెస్
జూన్ 6, 2026: అమెరికాలో తెలుగు సంస్కృతి, కళలను కాపాడుతూ ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడంలో ముందుండే అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) డీఎంవీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సయ్యంది పదం, జుమ్మంది నాదం బ్యూటీ పీజెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి. వర్జీనియాలోని లీస్బర్గ్ నగరంలో గల ద్రోమవల్ల ఫార్మ్స్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రతిభావంతులైన పోటీదారులు, కమ్యూనిటీ లీడర్లు, ప్రవాస తెలుగు కుటుంబాలు, పెద్ద సంఖ్యలో మద్దతుదారులు పాల్గొని సందడి చేశారు.
తెలుగు సంస్కృతి, సృజనాత్మకతను చాటిచెప్పిన ఈ ఈవెంట్‌కు స్థానిక తెలుగు సమాజం నుండి విశేష స్పందన లభించింది. రోజంతా సాగిన ఈ సంబరాలలో 110 మందికి పైగా పోటీదారులు తమ ప్రతిభను నిరూపించుకోగా, 400 మందికి పైగా అతిథులు హాజరై అభ్యర్థులను ప్రోత్సహించారు. ఈ సంస్కృతిక వేడుకలలో భాగంగా ఆటా సింగింగ్ కాంపిటీషన్ జుమ్మంది నాదం ప్రారంభమైంది. ఇందులో 30 మందికి పైగా గాయనీగాయకులు పాల్గొని తమ మధురమైన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
అనంతరం విజేతలను ప్రకటించి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఆ వెంటనే ఆటా డాన్స్ కాంపిటీషన్ సయ్యంది పదం మొదలైంది. ఈ వేదికపై 30 మందికి పైగా నృత్యకారులు క్లాసికల్, ఫోక్ కంటెంపరరీ (ఆధునిక) శైలుల్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ పోటీల ముగింపు వేడుకలు, విజేతల ఎంపిక సాయంత్రం పూర్తయింది.
అందాల పోటీలు..
ఇక ఈ ఉత్సవాలకే హైలైట్‌గా నిలిచిన బ్యూటీ పీజెంట్(అందాల పోటీలు) రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. 40 మందికి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ పోటీలో అభ్యర్థుల ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక అవగాహన, స్టేజ్ ప్రెజెన్స్‌ను న్యాయనిర్ణేతలు పరిశీలించారు. రాత్రి 11 గంటలకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన కిరీటధారణ విజేతల ప్రకటనతో ఈ ఈవెంట్ ముగిసింది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా కన్వెన్షన్ కన్వీనర్ శ్రీధర్ బనాలా, కన్వెన్షన్ కోఆర్డినేటర్లు రవి చల్లా, జీనత్ కుందూర్, కౌశిక్ సామ, డైరెక్టర్ సుధీర్ దామిడిలతో పాటు పలువురు కమిటీ చైర్మన్లు, కమ్యూనిటీ లీడర్లు, స్పాన్సర్లు తదితరులు హాజరయ్యారు. అద్భుతమైన టీమ్‌వర్క్‌తో ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన బ్యూటీ పీజెంట్ చైర్, సయ్యంది పదం చైర్, జుమ్మంది నాదం చైర్, కమిటీ సభ్యులు, జడ్జీలు, వాలంటీర్లు లోకల్ కోఆర్డినేటర్ల కృషిని ఆటా నాయకత్వం ప్రత్యేకంగా కొనియాడింది.
ఈ ఈవెంట్ సాధించిన గ్రాండ్ సక్సెస్, రాబోయే 19వ ఆటా కన్వెన్షన్ 2026 మహాసభలకు ఒక బలమైన పునాదిని సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక 19వ ఆటా మహాసభలు జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ నగరంలో జరగబోతున్నాయి.








