పిల్లల్లో తరచూ తలనొప్పి వస్తుందా? ఈ వ్యాధికి సంకేతం కావొచ్చు
Brain Tumor: చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) తర్వాత అత్యధికంగా నమోదవుతున్నది బ్రెయిన్ ట్యూమర్లేనని (మెదడు కణితులు) వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లోని నిమ్స్, నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి, రెయిన్బో, యశోద, కిమ్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ , ప్రభుత్వ ఆసుపత్రుల గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం సుమారు 250 మందికి పైగా చిన్నారులు మెదడు కణితుల చికిత్స కోసం వస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రికి వచ్చే మెదడు కణితి కేసుల్లో దాదాపు 30 శాతం వరకు చిన్నారులే ఉంటున్నారని ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ మానస పాణిగ్రాహి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా బాధితులు ఇక్కడికి వస్తుండగా, అందులో సగటున 10 శాతం మంది పిల్లలే ఉంటున్నారు.
ఒత్తిడి అనుకుంటే ప్రమాదమే..
నగరానికి చెందిన ఒక పదేళ్ల బాలికకు ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పి రావడం, వాంతులు కావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే తల్లిదండ్రులు దాన్ని కేవలం చదువు ఒత్తిడి, లేదా కంటి సమస్య అనుకుని లైట్ తీసుకున్నారు. కళ్లద్దాలు పెట్టించినా ఫలితం లేకపోగా సమస్య మరింత పెరిగింది. చివరకు న్యూరో డాక్టర్ను సంప్రదించడంతో మెదడులో కణితి (ట్యూమర్) ఉన్నట్లు తేలింది. వెంటనే చికిత్స అందించడంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి కోలుకుంది.
ఇవి కూడా చదవండి
చిన్నపిల్లలు తమ బాధను సరిగ్గా చెప్పుకోలేరని, తల్లిదండ్రులే వారిని గమనించి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో మెదడు కణితుల చికిత్స విషయంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని నిమ్స్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 60 నుంచి 70 శాతం కేసుల్లో తల్లిదండ్రులు వ్యాధి ముదిరిన ఆరు నెలల తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నట్లు పేర్కొన్నారు.
లక్షణాలు..
- పిల్లల్లో కింది లక్షణాలు తరచూ కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
- ఉదయం నిద్ర లేవగానే తీవ్రమైన తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం.
- మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల నడుస్తున్నప్పుడు తూలిపోవడం, నడకలో సమన్వయం కోల్పోవడం.
- వినికిడి లోపం ఏర్పడటం.
- హఠాత్తుగా ఫిట్స్ (మూర్ఛ) రావడం, స్పృహ తప్పడం, కళ్లు తేలేయడం.
- చూపు మసకబారడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ విజన్).
- ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, ఎప్పుడూ నిద్రమత్తుగా ఉండటం, చిరాకు పడటం, చదువుపై ఆసక్తి తగ్గడం.
అత్యాధునిక చికిత్సలు అందుబాటులో..
మెదడులో కణితి ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని ఏఐజీ ఆసుపత్రి న్యూరోసర్జన్ డా. సుబోధ్రాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కణితి రకం, సైజ్ , అది ఉన్న స్థానాన్ని బట్టి మైక్రో సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ, ఇమేజ్-గైడెడ్ నావిగేషన్, ఫోకస్డ్ రేడియేషన్ వంటి అడ్వాన్స్డ్ పద్ధతుల ద్వారా నయం చేయవచ్చన్నారు. చాలా కేసుల్లో డేకేర్ విధానంలోనే (అదే రోజు డిశ్చార్జ్ అయ్యేలా) చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే పిల్లలు పూర్తిగా కోలుకుని, సాధారణ జీవితాన్ని గడపవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.








