న్యూయార్క్‌లో త్వరలో ‘స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’
అమెరికాలోని ప్రవాస భారతీయులను, మన దేశ సాంస్కృతిక వైభవాన్ని ఒకే తాటిపైకి తీసుకొస్తూ న్యూయార్క్ పరిసర ప్రాంతాలలో సరికొత్త పండుగ వాతావరణం నెలకొంది. ‘ట్రైసిటీ ఇండియా అసోసియేషన్’ (Tricity India Association) ఆధ్వర్యంలో న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీ (Albany, NY) నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టిన ‘స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (Spring Festival of India) వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారత సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వాన్ని అమెరికా వేదికపై ఘనంగా చాటిచెప్పేలా ఈ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
ఈవెంట్ ప్రధాన వివరాలు…
తేదీ: జూన్ 7, 2026
సమయం: మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
వేదిక: ఎంపైర్ స్టేట్ ప్లాజా కన్వెన్షన్ సెంటర్ (Empire State Plaza Convention Center), అల్బానీ, న్యూయార్క్
సాంస్కృతిక ప్రదర్శనలు…
భారతీయ సంప్రదాయ నృత్యాల కలబోతగా సాగనున్న ఈ ఉత్సవంలో పలు రకాల ప్రాంతీయ నృత్య ప్రదర్శనలు (Cultural Performances) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకలను కేవలం సాంస్కృతిక ప్రదర్శనలకే పరిమితం చేయకుండా, ఇక్కడికి వచ్చే సందర్శకులకు సంపూర్ణ భారతీయ అనుభూతిని అందించేలా మరికొన్ని విభాగాలను కూడా యాడ్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నోరూరించే సంప్రదాయ వంటకాలతో కూడిన ప్రత్యేక ఫుడ్ స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ దుస్తులు, ఆభరణాలు, హస్తకళలు, సంప్రదాయ వస్తువులతో కూడిన వైవిధ్యభరితమైన షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
సమన్వయంతో పనిచేస్తున్న కమిటీ సభ్యులు…
అల్బానీ నగరంలో ఈ ఉత్సవాన్ని గ్రాండ్‌గా సక్సెస్ చేసేందుకు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలంగోవన్ రామన్ (Elangovan Raman) నేతృత్వంలోని టీమ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశారు.








