వాష్ రూంకి వెళ్లి వచ్చిన తర్వాత నేరుగా గుడికి వెళ్లవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయ్
హిందూ సంప్రదాయాలు , శాస్త్రాల ప్రకారం, దైవదర్శనానికి వెళ్లే సమయంలో శారీరక , మానసిక పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో, బాత్రూంకి (మలమూత్ర విసర్జనలు) వెళ్లి వచ్చిన తర్వాత నేరుగా దేవాలయానికి వెళ్లవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో వ్యక్తమవుతుంటుంది. దీనిపై ఆధ్యాత్మిక పండితులు సనాతన ధర్మ నియమాలను స్పష్టం చేశారు. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత శరీరం అపవిత్రంగా మారుతుందని, కాబట్టి కేవలం కాళ్లు, చేతులు కడుక్కుని గుడికి వెళ్లడం ఏమాత్రం తగదని శాస్త్రాలు చెబుతున్నాయి.
తప్పనిసరిగా స్నానం చేయాలి..
బాత్రూంకి వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా తలారా లేదా కనీసం ఒంటిపై నీళ్లు పోసుకుని పూర్తిగా స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత, అంతకుముందు ధరించిన బట్టలను మార్చేసి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలను లేదా మడి బట్టలను మాత్రమే ధరించి దేవాలయ ప్రవేశం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ స్నానం చేసిన తర్వాత కూడా మనస్సులో ఏదైనా శంక లేదా అపవిత్రత భావన ఉంటే, కొద్దిగా గంగాజలం లేదా పూజా జలాన్ని శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మంచిది.
నెలసరి (రుతుస్రావం) సమయంలో..
సనాతన ధర్మంలో శారీరక శుభ్రత నియమాలు కేవలం దైనందిన విసర్జనలకే కాకుండా, మహిళల నెలసరి సమయానికి కూడా వర్తిస్తాయి. శాస్త్రాల ప్రకారం, మహిళలు నెలసరి సమయంలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం లేదా దైవ కార్యాలలో పాల్గొనడం పూర్తిగా నిషిద్ధం. రుతుస్రావం సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు , శక్తి ఉద్గారాల కారణంగా ఆ సమయంలో శరీరానికి పూర్తి విశ్రాంతి అవసరమని, ఆధ్యాత్మికంగా కూడా ఆ సమయంలో దేవాలయాల్లో ఉండే శక్తి తరంగాలను శరీరం తట్టుకోలేదని పెద్దలు చెబుతారు.
నెలసరి ప్రారంభమైన రోజు నుండి మొదటి మూడు రోజులు ఖచ్చితంగా దైవకార్యాలకు, గుడికి వెళ్లడానికి దూరంగా ఉండాలి. సాధారణంగా నాలుగో రోజున తలస్నానం చేసిన తర్వాతే ఇంట్లో దీపారాధన చేయవచ్చు. అయితే, దేవాలయ ప్రవేశానికి లేదా వ్రతాలు, పూజలలో పాల్గొనడానికి మాత్రం 5 రోజులు పూర్తయి, శరీరం పూర్తిగా శుద్ధి అయిన తర్వాతే వెళ్లడం ఉత్తమమని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.
వయోవృద్ధులు, అనారోగ్య పరిస్థితుల్లో మినహాయింపులు
అయితే, చిన్నపిల్లలు, వృద్ధులు లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. స్నానం చేయడం సాధ్యకాని పక్షంలో వారు తడి గుడ్డతో శరీరాన్ని పూర్తిగా తూడ్చుకుని, బట్టలు మార్చుకుని దైవదర్శనానికి వెళ్లవచ్చు. కానీ సాధారణ ఆరోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ మాత్రం బాత్రూంకి వెళ్లి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం ఆచరించి, నియమాలను పాటించిన తరువాతే గుడికి వెళ్లడం ధర్మం అని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.








