ఎన్ఆర్ఐలకు టీటీడీ తీపి కబురు.. శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు
Tirupati: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రవాస భారతీయులకు (NRIs) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సరికొత్త శుభవార్త అందించింది. విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐల సౌకర్యార్థం సుపథం మార్గం ద్వారా కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శన కాలపరిమితిని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 30 రోజుల గడువును ఏకంగా 90 రోజులకు (3 నెలలు) పొడిగించింది. ఈ నూతన నిబంధన 6 వ తేదీ నుండే అమల్లోకి వచ్చింది.
గడువును 90 రోజులకు పెంచుతూ..
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే ఎన్ఆర్ఐలు తమ ఒరిజినల్ పాస్‌పోర్టు, వీసా ఆధారంగా తిరుమలలోని సుపథం మార్గం ద్వారా రూ. 300 టికెట్ పొంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది. అయితే, ఈ 30 రోజుల కాలపరిమితి తమకు సరిపోవడం లేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఈ అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన టీటీడీ యాజమాన్యం, ప్రవాస భారతీయుల సౌకర్యార్థం ఆ గడువును 90 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
శాశ్వత క్యూలైన్ల ఏర్పాటు..
మరోవైపు, తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ మరో కీలక అడుగు వేసింది. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం సర్కిల్ వరకు సరికొత్తగా శాశ్వత క్యూలైన్‌ను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిరంతర క్యూలైన్ల ద్వారా భక్తుల రద్దీని మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.








