తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఆడియో’ చిచ్చు!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఆ పార్టీని దశాబ్దాలుగా వేధిస్తున్న అంతర్గత విభేదాల సంస్కృతి మాత్రం వీడటం లేదు. నాయకుల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ నామినేషన్ సాంకేతిక కారణాలతో రద్దయిన వివాదం చల్లారకముందే.. పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసే మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో లీక్ కావడం ఇప్పుడు టీపీసీసీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.
దాదాపు మూడు నెలల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ ఆడియో క్లిప్‌లో.. షబ్బీర్ అలీ పార్టీ అంతర్గత పోకడలపై, ముఖ్యంగా ప్రస్తుతం పార్టీ బాధ్యతలు చూస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారని, లూప్‌హోల్స్‌ను వాడుకుంటూ ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా అందులోని వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబ్బు ఇస్తే కొనుక్కోగలిగే పార్టీగా మారిపోయిందని, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ఒక సీనియర్ నేత నోట రావడం కేవలం ఒక వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదు.. పార్టీలో అంతర్గతంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న తీవ్ర అసమ్మతికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేస్తూ వ్యతిరేక ప్రచారం, లీక్‌ల పర్వం వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక ఆధిపత్య పోరు దాగి ఉందని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పాలన వ్యవహారాల్లో, అభివృద్ధి కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. మరోవైపు సంస్థాగతంగా పార్టీని నడిపించే పీసీసీ పీఠంపై కొందరు సీనియర్లు మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. తమను కాదని వలస వచ్చిన వారికో, లేదా జూనియర్లకో ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన పాత కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, ఆయన నాయకత్వాన్ని బలహీనపరచడానికి ఇటువంటి ఆడియో క్లిప్పింగులను అస్త్రాలుగా వాడుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అంతర్గత విభేదాలు, సొంత పార్టీ నేతలే కాళ్ళు లాగడం కాంగ్రెస్ కు అలవాటే. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సంస్కృతి మారలేదని ఈ సంఘటన నిరూపిస్తోంది. పీసీసీ చీఫ్‌పై వ్యతిరేక ప్రచారం ఒకవైపు, నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య టికెట్లు, పదవుల లొల్లి మరోవైపు పార్టీ క్యాడర్‌ను తీవ్ర అయోమయంలో పడేస్తోంది. ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటూ, సొంత పార్టీ నేతల ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకుని మీడియాకు, సోషల్ మీడియాకు లీక్ చేసే స్థాయికి దిగజారడం పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రశ్నిస్తోంది.
మొత్తంగా చూస్తే, తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పుడు బయట ఉన్న విపక్షాల కంటే లోపల ఉన్న సొంత శత్రువుల నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో అధిష్టానం ఈ అంతర్గత సంక్షోభాన్ని ఎలా చల్లారుస్తుందో చూడాలి.








