ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేస్తున్నారా? అయితే ఫారం-16లో ఈ విషయాలు తప్పక చూసుకోవాల్సిందే!
Income Tax Returns: ఉద్యోగులకు యజమాన్యాల నుంచి ఫారం-16 జారీ ప్రక్రియ మొదలైంది. అయితే, పత్రం రాగానే రిటర్నులు దాఖలు చేయడంలో తొందరపడకూడదు. మీరు రిటర్నులు దాఖలు చేసే ముందు ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం ద్వారా పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చు.
రిటర్నులు దాఖలు చేసే ముందు..
ఫారం-16లో మీ పేరు, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్), చిరునామా, యజమాని వివరాలు , మదింపు సంవత్సరం వంటి సమాచారం సరిగ్గా ఉందో లేదో ముందుగా చూసుకోవాలి. ఏదైనా తప్పు ఉంటే, రిటర్నులు దాఖలు చేసే ముందే యజమానిని సంప్రదించి దాన్ని సరిదిద్దుకోవాలి.
అదనపు ఆదాయాలు..
ఫారం 26ఏఎస్ అనేది మీ పాన్ నంబరుపై వసూలైన పన్నుల వివరాలను చూపే వార్షిక ట్యాక్స్ క్రెడిట్ స్టేట్మెంట్. రిటర్నులు దాఖలు చేసే ముందు, ఫారం-16లో ఉన్న ఆదాయాన్ని , ఫారం 26ఏఎస్లో ఉన్న సమాచారాన్ని సరిపోల్చుకోవాలి. వడ్డీ లేదా డివిడెండ్ వంటి అదనపు ఆదాయాలు ఉంటే, వాటిని కూడా రిటర్నుల్లో ఖచ్చితంగా చూపాలి.
అన్ని ఆదాయ మార్గాలను..
ఒకటి కంటే ఎక్కువ చోట్ల పని చేసేవారు, అన్ని సంస్థల నుంచి వచ్చిన ఆదాయం , మినహాయింపులను కలిపి రిటర్నుల్లో చూపాలి. పన్ను బాధ్యతను లెక్కించేందుకు కేవలం ఫారం-16పై మాత్రమే ఆధారపడకుండా, అన్ని ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం. భవిష్యత్తు కోసం ఫారం-16 , ఫారం-16ఏ పత్రాలను కనీసం ఆరు సంవత్సరాల పాటు భద్రపరుచుకోవాలి.








