ఆన్లైన్ షాపింగ్‌లో దోపిడీ.. ‘డార్క్ ప్యాటర్న్స్’ వల్ల ఏటా రూ. 28 వేల కోట్లు స్వాహా!
దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇంట్లో కూర్చుని అరచేతిలో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ.. కావాల్సిన వస్తువును క్షణాల్లో ఆర్డర్ చేసే వెసులుబాటు పెరిగింది. అయితే ఈ సౌలభ్యం వెనుక కస్టమర్ల జేబులకు చిల్లులు పడే ప్రమాదం కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘డేటమ్ ఇంటెలిజెన్స్’ (Datum Intelligence) విడుదల చేసిన తాజా నివేదిక ఈ-కామర్స్ రంగంలోని చీకటి కోణాలను బట్టబయలు చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగిస్తున్న ‘డార్క్ ప్యాటర్న్స్’ (Dark Patterns) విధానం వల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లు ఏటా అక్షరాలా రూ. 25,000 కోట్ల నుంచి రూ. 28,000 కోట్ల మేర నష్టపోతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
కస్టమర్లు ఎలా మోసపోతున్నారు?
ప్రధానంగా ఈ-కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ యాప్స్.. తమ ఆదాయాన్ని (Online Shopping) అడ్డగోలుగా పెంచుకోవడానికి కస్టమర్లను మానసికంగా బురిడీ కొట్టించే పద్ధతులనే ‘డార్క్ ప్యాటర్న్స్’ అంటారు. కొనుగోలుదారుడు వస్తువును ఎంచుకుని ఫైనల్ చెక్అవుట్ (బిల్లు చెల్లింపు) చేసే సమయానికి అకస్మాత్తుగా ‘హ్యాండ్లింగ్ ఫీజులు’, ప్రాసెసింగ్ ఛార్జీల పేరిట అదనపు భారం మోపడం ఇందులో ప్రధానమైనది. దీనికి తోడు వినియోగదారుల ప్రమేయం లేకుండానే.. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎక్స్టెండెడ్ వారంటీ లాంటి అదనపు సేవల బాక్సులను ముందుగానే ‘టిక్’ (Pre-ticked) చేసి ఉంచడం ద్వారా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
‘ఇంకో రెండు నిమిషాల్లో ఈ ఆఫర్ ముగుస్తుంది’, ‘స్టాక్ అయిపోతోంది’ అంటూ కస్టమర్లలో కృత్రిమ ఆత్రుత (False Urgency) సృష్టించడం, ఒకసారి తీసుకున్న సబ్‌స్క్రిప్షన్‌ను సులభంగా రద్దు చేసుకునే అవకాశం లేకుండా చేయడం వంటి వ్యూహాలను కంపెనీలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
డేటమ్ నివేదిక ప్రకారం, దేశంలోని 30 కోట్ల మందికి పైగా ఆన్లైన్ కస్టమర్లలో (Online Shopping) ఏకంగా 88 శాతం మంది ఈ మాయాజాలానికి బలవుతున్నారు. దీనివల్ల ప్రతి నెలా ఒక్కో కస్టమర్ సగటున రూ. 78 నుంచి రూ. 87 వరకు తమకు తెలియకుండానే అదనంగా చెల్లిస్తున్నారు. ముఖ్యంగా 63 శాతం మంది కొనుగోలుదారులు ‘డ్రిప్ ప్రైసింగ్’ (బిల్లింగ్ చివరలో దాచిన ఛార్జీలు కలపడం) బాధితులేనని పరిశోధనలో తేలింది.
అవగాహన ఉన్నా.. ఆత్రుతకే బలి
ఈ అధ్యయనంలో వెలుగుచూసిన మరో విస్మయకరమైన వాస్తవం ఏమిటంటే.. ఆన్లైన్ మోసాలపై (Online Shopping) పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారిలో కూడా 85 శాతం మంది ఈ డార్క్ ప్యాటర్న్స్ ఉచ్చులో పడుతున్నారు. యాప్స్ క్రియేట్ చేసే కృత్రిమ ఆత్రుతకు లొంగిపోయి, ఆఫర్ సమయం మించిపోతుందన్న భయంతో అదనపు మొత్తాలు చెల్లించి మరీ కొనుగోళ్లు ముగిస్తున్నారు. ఇక ఈ ప్లాట్‌ఫామ్‌ల పట్ల కస్టమర్ల విశ్వాసాన్ని పరిశీలిస్తే.. ఆన్లైన్ రిటైల్ రంగంలో ‘అమెజాన్’ (Amazon) అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా కస్టమర్ల మన్ననలు పొందింది. అయితే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ (Flipkart) విషయంలో మాత్రం కస్టమర్లకు నమ్మకం కంటే అనుమానాలే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ప్రయాణాలకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్స్ విభాగంలో ‘మేక్మైట్రిప్’ (MakeMyTrip) మెరుగైన రేటింగ్‌తో ముందంజలో నిలిచింది.
పారదర్శకతకే వినియోగదారుల పట్టం
కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార పరిమాణాన్ని, లాభాలను పెంచుకోవడానికి ఇలాంటి దొడ్డిదారులు వెతుకుతున్న తీరుపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 74 శాతం మంది కస్టమర్లు ఈ డార్క్ ప్యాటర్న్స్ పద్ధతులను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వస్తువు లేదా సేవకు సంబంధించి అదనంగా రెండు రూపాయలు (Online Shopping) ఎక్కువైనా చెల్లించేందుకు తాము సిద్ధమే కానీ, ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించే యాప్స్‌కే తమ మొదటి ప్రాధాన్యత అని కస్టమర్లు స్పష్టం చేస్తున్నారు. డిజిటల్ మోసాల బారినుంచి వినియోగదారులను రక్షించేందుకు ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక నొక్కిచెబుతోంది.








