డాలర్ దెబ్బతో భారంగా మారిన విదేశీ విద్య.. అప్పుల ఊబిలో భారతీయ విద్యార్థులు
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పతనమవడం విదేశాల్లో ఉన్నత విద్య (Foreign Education) అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. గత పన్నెండు నెలల కాలంలో రూపాయి విలువ ఏకంగా 10 శాతానికి పైగా క్షీణించింది. ఈ పరిణామంతో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, స్వదేశంలో ఉన్న వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దేశీయ బ్యాంకులు మంజూరు చేసిన విద్యా రుణాలు లేదా ఇక్కడి నుంచి తల్లిదండ్రులు పంపించే డబ్బును డాలర్లలోకి మార్చుకునే సమయంలో వ్యత్యాసం భారీగా ఉంటోంది. ముందుగా వేసుకున్న బడ్జెట్ అంచనాలు తలకిందులు కావడంతో, ట్యూషన్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం విద్యార్థులు అదనపు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
తలకిందులైన ఆర్థిక అంచనాలు
సాధారణంగా విద్యార్థులు అడ్మిషన్ల సమయంలోనే రుణ ఒప్పందాలు చేసుకుంటారు. అప్పట్లో డాలర్ విలువ రూ. 85 వద్ద ఉండగా.. అనూహ్యంగా ఇప్పుడు అది రూ. 95 మార్కును దాటేసింది. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ కరెన్సీ మారకం విలువ రూ. 83 నుంచి ఏకంగా రూ. 96 పైచిలుకు చేరిందని విద్యా (Foreign Education) రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ వ్యత్యాసం వల్ల అమెరికాలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ పూర్తి చేయడానికి గతంలో కంటే అదనంగా సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు భారం పెరిగింది. కేవలం కాలేజీ ఫీజులే కాకుండా ప్రయాణ ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నాయి. ఏడాది క్రితం రానుపోను విమాన ఛార్జీలు రూ. 96 వేలుగా ఉండగా, ప్రస్తుతమది రూ. 1.60 లక్షలకు ఎగబాకాయి.
టాప్-అప్ లోన్లకు డిమాండ్..
కరెన్సీ క్షీణతతో చేతిలో ఉన్న నిధులు ఏమాత్రం సరిపోక, బతుకుదెరువు కోసం విద్యార్థులు అదనంగా రూ. లక్ష నుంచి రూ. 6 లక్షల వరకు ‘టాప్-అప్’ లోన్లు లేదా వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఇలా అదనపు రుణాలు కోరే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విద్యార్థులు (Foreign Education) విదేశాల్లో ఉండటం వల్ల లోన్ల పెంపునకు బ్యాంకింగ్ నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. కొత్తగా లోన్ మంజూరు చేయాలన్నా, ఉన్న దానికి అదనపు మొత్తం కలపాలన్నా.. పవర్ ఆఫ్ అటార్నీ (PoA) ప్రక్రియ, కొత్త ధృవీకరణ పత్రాల సమర్పణ తప్పనిసరి. వీటి ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలు
గణాంకాల ప్రకారం, ప్రస్తుతం భారతదేశం నుంచి విదేశీ విద్య (Foreign Education) కోసం ఏటా దాదాపు రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల మేర విద్యా రుణాలు మంజూరు అవుతున్నాయి. ఇందులో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటాయే 20 నుంచి 25 శాతం వరకు ఉంది. తాజా పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి సకాలంలో అదనపు రుణాలు అందక, ఫీజులు కట్టాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తమ చేతిలో ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, స్థిరాస్తులను అమ్ముకోవడం లేదా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తంగా డాలర్ ఆధిపత్యం.. ఉన్నత చదువుల (Foreign Education) కోసం వెళ్లిన విద్యార్థులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది.








