తెలంగాణపై కేంద్రం వివక్ష : మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మండిపడ్డారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పందన లభించడం లేదని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తెలంగాణ ( Telangana)కు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కేవలం మద్దతు ధరను ప్రకటించి, ఆ తర్వాత కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, అలా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నా కూడా ఎందుకు తమపై ఇంత వివక్ష అని ప్రశ్నించారు. మద్దతు ధర ప్రకటించిన అన్ని రకాల ధాన్యాలనూ సేకరించాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకొంటూ, రాష్ట్ర రైతాంగాన్ని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కేంద్రం చేతులెత్తేసినా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడలేదని, ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న (Corn)తో పాటు, 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను (Sorghum) రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఈ ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.








