మేరీల్యాండ్ లో ఆటా టెన్నిస్ టోర్నమెంట్ కు భారీ స్పందన
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మేరీల్యాండ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టెన్నిస్ టోర్నమెంట్ కు భారీ స్పందన వచ్చింది. అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ టోర్నమెంట్ కు టెన్నిస్ క్రీడాభిమానులు, ప్రవాస తెలుగువారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కీడా స్ఫూర్తి, సోదరభావం మరియు ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్ కు ఆటా నాయకులు కూడా హాజరయ్యారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు కోర్ టీమ్ సభ్యులు, కమిటీ చైర్మన్లు, పలువురు తెలుగు సంఘాల నాయకులు హాజరై, ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ అభినందించారు.
అన్ని వయసుల ఆటగాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపడ్డారు. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో విజేతలకు, రన్నరప్‌లకు ట్రోఫీలను అందజేశారు. ఈ టోర్నమెంట్ ఆరోగ్యకరమైన జీవనశైలిని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, తెలుగు కమ్యూనిటీ మధ్య బంధాలను మరింత బలోపేతం చేసింది. అంతేకాకుండా, రాబోయే 19వ ఆటా మహాసభలపై అందరిలోనూ భారీ అంచనాలను, ఉత్సాహాన్ని నింపింది. ఈ మహాసభలు జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌ను ఇంతటి ఘన విజయం గావించిన విజేతలకు, క్రీడాకారులకు, నిర్వాహకులకు, వాలంటీర్లకు మరియు మద్దతుదారులందరికీ ఏటీఏ కోర్ టీమ్ అభినందనలు తెలిపింది. ముఖ్యంగా, అద్భుతమైన ఏర్పాట్లతో, ఆతిథ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మేరీల్యాండ్ టీమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.








