తయారీ రంగంలో చైనా ఆధిపత్యం వెనుక అసలు గుట్టు.. కారణం అదే?
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంపై, ప్రత్యేకించి తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగంలో చైనా (China) దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్న తిరుగులేని ఆధిపత్యం వెనుక ఉన్న అసలు రహస్యం బట్టబయలైంది. అంతర్జాతీయ మార్కెట్లో డ్రాగన్ దేశపు అద్భుత ప్రగతి వెనుక ఉన్నది కేవలం వారి సాంకేతిక నైపుణ్యమో, చౌకైన శ్రమశక్తో కాదని.. ఆ దేశ ప్రభుత్వం వెనుక ఉండి నడిపించిన భారీ ఆర్థిక ప్రోత్సాహకాలేనని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ – OECD) నివేదిక స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, వేగంగా ఎదుగుతున్న మార్కెట్ల కంటే కూడా చైనా (China) సంస్థలు అనూహ్య స్థాయిలో ప్రభుత్వ దన్ను పొందాయని ఈ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
భారత్తో పోలిస్తే ఎంతో దూరం
గత రెండు దశాబ్దాల కాలంలో, అంటే 2005 నుంచి 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అందించిన మద్దతును ఓఈసీడీ క్షుణ్ణంగా విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల కంపెనీలతో పోలిస్తే చైనా (China) తయారీ సంస్థలు సగటున మూడు నుంచి ఎనిమిది రెట్లు అధికంగా ప్రభుత్వ సబ్సిడీలను దక్కించుకున్నాయి. కేవలం అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా భారత్, బ్రెజిల్, ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చినా చైనా తన దేశీయ కంపెనీలకు అకారణంగా భారీ ఆర్థిక లబ్ధి చేకూర్చింది. మన దేశీయ సంస్థలకు భారత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాల కంటే.. చైనా (China) కంపెనీలకు ఆ దేశ ప్రభుత్వం అందించిన సబ్సిడీలే అత్యధికమని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
మార్కెట్ ఆక్రమణకు ప్రభుత్వ ఆయుధాలు
ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే స్థాయికి ఎదగడానికి చైనా (China) ప్రభుత్వం ప్రధానంగా మూడు మార్గాల్లో తన కంపెనీలకు అండగా నిలిచింది. భారీ స్థాయిలో ఉచిత గ్రాంట్లు మంజూరు చేయడం, పన్నుల్లో విపరీతమైన రాయితీలు కల్పించడం, అత్యంత తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాలను అందజేయడం వంటి విధానాలను యథేచ్ఛగా అమలు చేసింది. ఓఈసీడీ నివేదిక అంచనా ప్రకారం.. 2005-2023 మధ్య కాలంలో ప్రపంచ మార్కెట్లో వివిధ దేశాల కంపెనీలు సాధించిన వాటా వృద్ధిలో సుమారు 22 శాతం కేవలం ప్రభుత్వ సబ్సిడీల వల్లే సాధ్యమైంది. అయితే చైనా (China) సంస్థల విషయంలో ఈ సబ్సిడీల ప్రభావం మరింత భయంకరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చైనా కంపెనీల వాటా పెరగడానికి ఏకంగా 60 శాతం ఆ దేశ ప్రభుత్వ మద్దతే కారణమని నివేదిక కుండబద్దలు కొట్టింది. ప్రపంచ వాణిజ్య యవనికపై సబ్సిడీలు మార్కెట్ పోటీని ఎంతలా శాసిస్తున్నాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.
డబ్ల్యూటీఓకు తప్పుడు లెక్కలు
ప్రపంచంలోని 15 కీలకమైన తయారీ రంగాలకు చెందిన 525 అతిపెద్ద దిగ్గజ కంపెనీల ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ (China) మద్దతులపై ఉన్న డేటాను లోతుగా విశ్లేషించి ఓఈసీడీ ఈ నివేదికను రూపొందించింది. ఈ పరిశోధనలో ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మనుగడనే ప్రశ్నించే మరో తీవ్రమైన అంశం కూడా వెలుగుచూసింది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ – WTO) సభ్య దేశాలు తాము ఇచ్చే సబ్సిడీల వివరాలను పారదర్శకంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఈ వివరాలను దాచిపెడుతున్న దేశాల సంఖ్య నానాటికీ భయంకరంగా పెరుగుతోందని ఓఈసీడీ హెచ్చరించింది. 1995వ సంవత్సరంలో ఇలాంటి వివరాలు వెల్లడించని దేశాలు కేవలం 23 శాతం ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 70 శాతానికి చేరుకోవడం గమనార్హం.
మొత్తంగా సబ్సిడీల వివరాలను దాచిపెట్టడం వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో ఆరోగ్యకరమైన, సమానమైన పోటీ వాతావరణం దెబ్బతింటోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా (China) అనుసరిస్తున్న ఈ ఏకపక్ష సబ్సిడీల వ్యూహం వల్ల భారత్ వంటి దేశాలలోని స్థానిక తయారీ రంగ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో అసమాన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదిక పరోక్షంగా స్పష్టం చేస్తోంది.








