భారత్‌కు అమెరికా ఊహించని షాక్.. ‘వెట్టి చాకిరీ’ సాకుతో 12.5 శాతం పన్ను!
అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన కఠిన వైఖరిని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. భారతదేశంతో సహా ఏకంగా 54 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 12.5 శాతం మేర భారీ సుంకాలు (US Tariffs) విధించాలని ‘యూఎస్ ట్రేడ్ రిప్రజంటేటివ్’ తాజాగా ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇంతటి భారీ పన్ను వడ్డనకు అగ్రరాజ్యం చెబుతున్న కారణం.. ‘బలవంతపు శ్రమ’. అవును.. వెట్టి చాకిరీతో లేదా బలవంతంగా కార్మికులతో తయారు చేయించిన వస్తువులు దేశంలోకి రాకుండా అడ్డుకోవడంలో ఈ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయనేది యూఎస్టీఆర్ ప్రధాన ఆరోపణ.
యూఎస్టీఆర్ దర్యాప్తులో ఏం తేలింది?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాల వాణిజ్య విధానాలపై అమెరికా లోతైన దర్యాప్తు జరిపింది. అందులో 54 దేశాలు ఈ బలవంతపు శ్రమతో కూడిన ఉత్పత్తుల దిగుమతులను నిలువరించేందుకు ఎలాంటి కఠినమైన చట్టాలను గానీ, నిబంధనలను గానీ అమలు చేయడం లేదని తేల్చింది. ఈ అమెరికా లిస్ట్‌లో కేవలం భారత్ (US Tariffs) మాత్రమే కాదు.. చైనా, జపాన్, బ్రిటన్ (యూకే), ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌదీ అరేబియా వంటి బడా ఆర్థిక వ్యవస్థలు కూడా ఉండటం గమనార్హం.
“మాకు ఎంతో కీలకమైన వాణిజ్య భాగస్వాములు సైతం ఇంతటి సున్నితమైన సమస్యను గాలికొదిలేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల చట్టబద్ధంగా పనిచేసే మా అమెరికన్ కార్మికులు, అంతర్జాతీయ మార్కెట్లో అక్రమ మార్గాల్లో తయారై చౌకగా వచ్చే వస్తువులతో అనవసరంగా పోటీ పడాల్సిన దుస్థితి వస్తోంది” అని యూఎస్టీఆర్ రాయబారి జేమీసన్ గ్రీర్ మండిపడ్డారు.
ఆ దేశాల్లో చట్టాలున్నా అమలు శూన్యం!
ఇదే నివేదికలో మరికొన్ని దేశాల ప్రస్తావన కూడా ఉంది. కెనడా, యూరోపియన్ యూనియన్ (EU), పాకిస్తాన్, మెక్సికో, ఈక్వెడార్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ తరహా ఉత్పత్తులను నిషేధిస్తూ చట్టాలు అయితే ఉన్నాయి కానీ.. గ్రౌండ్ లెవల్లో వాటి అమలు మాత్రం ఏమాత్రం ప్రభావవంతంగా లేదని అమెరికా (US Tariffs) తప్పుబట్టింది. ఆయా దేశాలు తమ చట్టాలను కేవలం కాగితాలకే పరిమితం చేశాయని అసహనం వ్యక్తం చేసింది.
కౌంటర్ ఇచ్చిన భారత్!
అయితే అమెరికా ఏకపక్షంగా తీసుకొచ్చిన ఈ టారిఫ్ (US Tariffs) ప్రతిపాదనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమపై చేస్తున్న ఈ దర్యాప్తును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ వాణిజ్య పరంగా లేదా కార్మికుల హక్కుల పరంగా ఏవైనా నిజమైన అభ్యంతరాలు ఉంటే.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చల వేదికగా వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, ఇలా అకస్మాత్తుగా పన్నుల వడ్డనకు దిగడం ఏమాత్రం సరికాదని భారత్ చాలా స్పష్టంగా కౌంటర్ ఇచ్చింది. ఈ సుంకాలు గనుక నిజంగా అమలైతే, భారతీయ ఎగుమతిదారులపై తీవ్ర భారం పడే ప్రమాదం ఉందని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.








