సూర్యుడిపై గురిపెట్టిన భారత్.. సోలార్ పవర్లో మనదే వరల్డ్ రికార్డ్!
విద్యుత్ రంగంలో రాబోయే కాలమంతా పర్యావరణ అనుకూల ఇంధనాలదే (గ్రీన్ ఎనర్జీ) అని ప్రపంచ దేశాలకు ముందే తెలుసు. ఈ విషయాన్ని పసిగట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భారతదేశం, ఇప్పుడు ఆచరణలో అద్భుతాలు సృష్టిస్తోంది. సౌర విద్యుత్ (Solar Energy) రంగంలో కనివినీ ఎరుగని రీతిలో దూసుకుపోతూ చరిత్ర తిరగరాస్తోంది. ఎప్పుడూ పెట్టుబడులు, వనరుల విషయంలో అగ్రరాజ్యంగా విర్రవీగే అమెరికాకే ఇప్పుడు ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అత్యంత వేగంగా పెంచుకుంటున్న దేశాల జాబితాలో అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టి ఏకంగా ప్రపంచంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
అమెరికా అవుట్.. చైనా మాత్రమే ముందు!
అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలోని లెక్కలు చూస్తే భారత సౌర విద్యుత్ (Solar Energy) సత్తా ఏంటో అర్థమవుతుంది. 2025వ సంవత్సరంలో భారతదేశం కొత్తగా ఏకంగా 37 గిగావాట్ల (GW) సోలార్ విద్యుత్‌ను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా కేవలం 34 గిగావాట్లకు మాత్రమే పరిమితం కావడంతో, ఆ దేశాన్ని అధిగమించి భారత్ సగర్వంగా రెండో స్థానంలో నిలిచింది. ఇకపోతే 315 గిగావాట్ల భారీ సామర్థ్యంతో చైనా ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి 2024లో జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలో మూడో అతిపెద్ద సౌర విద్యుత్ (Solar Energy) ఉత్పత్తి దారుగా నిలిచిన మన దేశం.. కేవలం ఏడాది తిరిగే సరికి ఏకంగా రెండో స్థానానికి ఎగబాకడం గ్లోబల్ మార్కెట్‌ను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
14 నెలల్లోనే మ్యాజిక్..
భారత్‌లో సోలార్ పవర్ విస్తరణ వేగం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. 2022 నాటికి దేశంలో మొత్తం సోలార్ విద్యుత్ సామర్థ్యం 50 గిగావాట్లు ఉండగా.. ఆ తర్వాత మరో 50 గిగావాట్ల మైలురాయిని చేరుకోవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. కానీ ఆ తర్వాతే అసలైన మ్యాజిక్ జరిగింది. 2025 జనవరి నుంచి 2026 మార్చి మధ్య.. అంటే కేవలం 14 నెలల రికార్డు వ్యవధిలోనే భారత్ అదనంగా మరో 50 గిగావాట్లను ఉత్పత్తి చేసి, దెబ్బకు మొత్తం సామర్థ్యాన్ని 154 గిగావాట్లకు (Solar Energy) పెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్టమైన విధానాలు, ఈ రంగంలోకి భారీగా వస్తున్న విదేశీ, స్వదేశీ పెట్టుబడుల వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అంచనాలను పటాపంచలు చేస్తూ..
సాధారణంగా ప్రభుత్వాలు పెట్టుకున్న టార్గెట్లు రీచ్ అవ్వడమే గగనంగా ఉంటుంది. కానీ ఈ గ్రీన్ ఎనర్జీ (Solar Energy) విషయంలో మాత్రం 2026 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 34 గిగావాట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో 44.61 గిగావాట్ల విద్యుత్‌ను భారత్ అదనంగా సాధించింది. ప్రస్తుతం దేశంలో బొగ్గు, గ్యాస్ వంటి కాలుష్య కారక ఇంధనాలు కాకుండా, కేవలం పర్యావరణ అనుకూల (శిలాజేతర) వనరుల ద్వారా ఏకంగా 288 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే.. అందులో సింహభాగం కేవలం ఈ సోలార్ పవర్‌దే (Solar Energy) కావడం విశేషం. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్‌ను పట్టుకోవడం ఏ దేశానికీ సాధ్యం కాదనేది నిర్వివాదాంశం.








