రీల్స్ చేయండి.. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా వుండండి : మంత్రులకు మోదీ సూచనలు
సోషల్ మీడియాలో ఇప్పటికే పటిష్ఠంగా వున్న బీజేపీ.. మరింత పటిష్ఠ కావాలని యోచిస్తోంది.నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని రోజులుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా కేంద్రంగానే జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా జంతర్ మంతర్ దగ్గర మరింత ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.
దీనికి పూర్తి విరుగుడును కనిపెట్టే యోచనలో మోదీ సర్కార్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. యువతకు మరింతగా చేరువయ్యేందుకు కేంద్ర మంత్రులు ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది యాక్టివ్‌గా ఉంటున్నారని ప్రధాని మోదీ మంత్రులను ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో యువత ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నట్టు చెప్పారు. కాబట్టి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల్లో యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినంత మాత్రాన సరిపోదని ప్రధాని మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో నేరుగా యువతతో టచ్‌లో ఉండాలని ప్రధాని సూచించారు. యువతకు మరింత దగ్గర చేసే రీల్స్ వంటి క్రియేటివ్ కంటెంట్‌ను పోస్టు చేస్తూ ఉండాలని సూచించారు మోదీ.








