ఇకపై అలాంటి రిస్క్ అస్సలు చేయనని చెప్పిన అఖిల్!
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) కెరీర్లో ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బల్లో అఖిల్(Akhil), ఏజెంట్(Agent) సినిమాలు ప్రధానంగా నిలిచాయి. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన ఆ వైఫల్యాల గురించి ఎలాంటి మొహమాటం లేకుండా స్పందించారు. ముఖ్యంగా ఏజెంట్ సినిమా రిజల్ట్ తనను మానసికంగా తీవ్రంగా దెబ్బతీసిందని, ఆ సమయంలో పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయానని తెలిపారు. ఆ సినిమా ప్రారంభమైనప్పుడు పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోయిందని, ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు అలాంటి విధానంలోనే పని చేస్తారని చెప్పినా, తనకు మాత్రం ఆ అనుభవం గుణపాఠంగా మారిందన్నారు. నిర్మాత భారీ ఆర్థిక నష్టాలను చవిచూడడం తనను మరింత బాధించిందని కూడా అంగీకరించారు.
ఆ ఎక్స్‌పీరియెన్స్ తర్వాత తన పని తీరులో కీలకమైన మార్పు తీసుకువచ్చానని అఖిల్ వెల్లడించారు. ఇకపై పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ చేతిలో లేకుండా ఏ సినిమాను స్టార్ట్ చేయనని స్పష్టం చేశారు అఖిల్. కథ, స్క్రీన్‌ప్లే, పాత్రలపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే షూటింగ్‌కు వెళ్లడం తన ఫస్ట్ ప్రియారిటీ అని పేర్కొన్నారు. ఇటీవల రిలీజైన లెనిన్(Lenin) తనకు యాక్టర్ గా కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని, ఆ సినిమా తర్వాత మరింత ప్రశాంతంగా ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఇప్పటికే మరో కొత్త ప్రాజెక్ట్‌కు అంగీకరించానని, సరైన టైమ్ లో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని వెల్లడించారు.
పర్సనల్ లైఫ్ పై కూడా అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన లైఫ్ పార్టనర్ జైనబ్ రావ్జీ(Zainab Ravdjee)తో ఎన్నో సంవత్సరాల పాటు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రయాణించిన తర్వాతే వివాహం చేసుకున్నామని చెప్పారు. ఏడాది క్రితమే తమ పెళ్లి జరిగిందని వెల్లడించారు. కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశలో జైనబ్ తనకు అండగా నిలిచి ధైర్యం ఇచ్చిందని, ఆ మద్దతు వల్లే తిరిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలిగానని అఖిల్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. కెరీర్ లైఫ్ లో నేర్చుకున్న పాఠాలతో పాటు పర్సనల్ లైఫ్ లో లభించిన బలమే తన కొత్త ప్రయాణానికి ప్రధాన ఆధారమని ఆయన వ్యాఖ్యానించారు.








