ఇంటర్నెట్లో మనుషులను వెనక్కి నెట్టిన ‘చాట్‌బాట్స్’..
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Chatbots) అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇంటర్నెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, అంతర్జాల వినియోగంలో మనుషులను ‘చాట్బాట్లు’ (ఆటోమేటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు) వెనక్కి నెట్టేశాయి. ప్రముఖ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రతా సంస్థ ‘క్లౌడ్‌ఫ్లేర్’ (Cloudflare) సీఈఓ మాథ్యూ ప్రిన్స్ ఈ సంచలన నివేదికను వెల్లడించారు. తాజా గణాంకాల ప్రకారం, ఇంటర్నెట్ వాడకంలో మనుషుల కంటే రోబోటిక్ ప్రోగ్రామ్లదే స్పష్టమైన ఆధిపత్యం నడుస్తోందని ఆయన తెలిపారు.
క్లౌడ్‌ఫ్లేర్ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో ఏకంగా 57.5 శాతం వాటా ఈ అడ్వాన్స్డ్ చాట్బాట్ల (AI Chatbots) నుంచే వస్తోంది. అదే సమయంలో వెబ్సైట్లను యాక్సెస్ చేస్తున్న మనుషుల వాటా కేవలం 42.5 శాతానికి పడిపోయింది. ఇంటర్నెట్లో మానవ ట్రాఫిక్ కంటే మెషిన్ ట్రాఫిక్ పెరగడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక పరిణామంపై మాథ్యూ ప్రిన్స్ స్పందిస్తూ.. “ఈ స్థాయికి మార్పు జరగడానికి భవిష్యత్తులో ఇంకా చాలా సమయం పడుతుందని మేము అంచనా వేశాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ రాకెట్ వేగంతో దూసుకురావడం వల్లే మా అంచనాల కంటే ముందే ఈ పరిణామం సంభవించింది” అని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ను ముంచెత్తుతున్న ఈ కొత్త తరం చాట్బాట్లు (AI Chatbots) అచ్చం మనుషుల తరహాలోనే వ్యహరిస్తూ ఆన్లైన్లో పలు రకాల సంక్లిష్టమైన పనులను కూడా క్షణాల్లో చక్కబెడుతున్నాయి. వివిధ ఈ-కామర్స్ వెబ్సైట్లలో వస్తువుల ధరలను పోల్చి చూడటం, అత్యంత తక్కువ ధరలో విమాన టికెట్ల కోసం సెర్చ్ చేయడం, ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని సేకరించడం, అలాగే వివిధ సంస్థల కస్టమర్ కేర్ సేవలను ఆటోమేటిక్‌గా నిర్వహించడం లాంటి వందలాది పనులను ఇవి (AI Chatbots) ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తున్నాయి. ఏఐ మోడల్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వీటి వేగం, సామర్థ్యం మరింత పెరుగుతోంది.
ఆన్లైన్ పనుల నిర్వహణలో, డేటా అనాలిసిస్లో చాట్బాట్లు పైచేయి సాధించినప్పటికీ.. వినోద రంగంలో మాత్రం ఇంకా మనుషులదే ఆధిపత్యం కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు వీక్షించడం, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో రీల్స్ స్క్రోల్ చేయడం వంటి కంటెంట్‌ను ఆస్వాదించే విషయాల్లో మానవ ట్రాఫిక్ అగ్రస్థానంలోనే ఉంది.
ఇక దేశాల వారీగా ఈ ఆటోమేటెడ్ (AI Chatbots) లేదా బాట్ ట్రాఫిక్‌ను పరిశీలిస్తే ఆసక్తికరమైన గణాంకాలు వెలుగుచూశాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ‘జిబ్రాల్టర్’ దేశంలో ఏకంగా 92.1 శాతం చాట్‌బాట్ ట్రాఫిక్ నమోదవుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో టెక్నాలజీ హబ్ సింగపూర్, ఇరాన్ దేశాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ వ్యవస్థలన్నీ వేగంగా ఆటోమేషన్ వైపు మళ్లుతున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష ఉదాహరణ అని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.








