ఆత్మీయుల గొంతుతో సైబర్ వల.. ఏఐ ‘ఫేక్ కాల్స్’కు గూగుల్ చెక్
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయి. మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల గొంతును ‘ఏఐ వాయిస్ క్లోనింగ్’ ద్వారా అచ్చుగుద్దినట్లు సృష్టించి.. “అర్జెంట్‌గా అవసరం ఉంది, ఓ పదివేలు గూగుల్ పే చేయి” అంటూ సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహా అత్యాధునిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెక్ దిగ్గజం ‘గూగుల్’ (Google) ఒక వినూత్నమైన ‘ఫేక్ కాల్ డిటెక్షన్’ ఫీచర్‌ను తెరపైకి తెచ్చింది.
అలర్ట్ చేసే ‘సీక్రెట్ కోడ్’ విధానం
గూగుల్ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త టెక్నాలజీ అత్యంత స్మార్ట్‌గా పనిచేస్తుంది. మీకు తెలిసిన వ్యక్తి నిజంగానే తన సొంత ఫోన్ నుంచి కాల్ చేసినప్పుడు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఫోన్ నుంచి మీ మొబైల్‌కు ఒక ‘సీక్రెట్ వెరిఫికేషన్ సిగ్నల్’ (కోడ్) అందుతుంది. ఒకవేళ అవతలి వైపు ఉన్నది నేరగాళ్లైతే, వారు కేవలం మీ బంధువుల ఫోన్ నంబర్‌ను స్పూఫ్ చేసి లేదా వాయిస్‌ను మార్చి కాల్ చేస్తారు కాబట్టి, ఆ సీక్రెట్ కోడ్ మీ ఫోన్‌కు చేరదు. సిగ్నల్ రానట్లయితే గూగుల్ (Google) వ్యవస్థ వెంటనే అప్రమత్తమై.. “ఈ కాల్ అనుమానాస్పదంగా ఉంది.. జాగ్రత్త వహించండి” అంటూ మొబైల్ స్క్రీన్‌పై ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. దీనివల్ల కేవలం వాయిస్ విని మోసపోయే ప్రమాదానికి చెక్ పడుతుంది.
ఆండ్రాయిడ్ వినియోగదారులకే..
కాల్స్ స్క్రీనింగ్ నేపథ్యంలో తమ వ్యక్తిగత సంభాషణలను గూగుల్ వింటుందేమోనన్న ఆందోళన వినియోగదారుల్లో సహజం. అయితే దీనిపై కంపెనీ (Google) స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ డిటెక్షన్ ప్రక్రియ మొత్తం ఫోన్ లోపలే (ఆన్-డివైజ్ ప్రాసెసింగ్) ఆటోమేటిక్‌గా జరుగుతుందని, యూజర్ల సంభాషణలను ఎవరూ వినే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇందుకోసం అత్యంత సురక్షితమైన ‘ఆర్సీఎస్’ (RCS) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే.. కాల్ చేసే వారు, రిసీవ్ చేసుకునే వారు ఇద్దరూ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతూ ఉండాలి. అలాగే అందులో ‘ఫోన్ బై గూగుల్’ (Phone by Google) యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఈ ఫీచర్ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లో సులభంగా ఆఫ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది.
సైబర్ యుగంలో ‘డిజిటల్ భరోసా’
తొలిదశలో ఆండ్రాయిడ్ 12 లేదా ఆపై వెర్షన్ ఉన్న ‘గూగుల్ పిక్సెల్’ స్మార్ట్ఫోన్లలో ఈ ఫేక్ కాల్ డిటెక్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. అనంతరం దశలవారీగా మిగిలిన అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు విస్తరించనున్నారు. ఏఐ సాంకేతికత హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో.. కేవలం ఫోన్ నంబర్ చూసో, గొంతు వినో గుడ్డిగా నమ్మేయలేని ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో గూగుల్ (Google) తీసుకువచ్చిన ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సామాన్యులకు ఒక డిజిటల్ భరోసాలా పనిచేస్తుందని, కళ్లెదుటే జరుగుతున్న భారీ ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








