ఓటర్ల మ్యాపింగ్ నిలిపివేత.. అసలేం జరుగుతోంది?
తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం అకస్మాత్తుగా నిలిపివేసింది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ముందస్తు సన్నాహాల్లో భాగంగా చేపట్టిన ఈ కీలక ప్రక్రియ శనివారం నుంచి పూర్తిగా ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వంద శాతం మ్యాపింగ్ పూర్తి కాకముందే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 35,985 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ మ్యాపింగ్ ప్రక్రియ జరిగింది. తెలంగాణలో మొత్తం 3,38,29,018 మంది ఓటర్లు ఉండగా, అధికారులు ఇప్పటివరకు 2,36,54,232 మంది, అంటే కేవలం 69.92 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్‌ను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 1,01,74,786 మంది ఓటర్లను మ్యాపింగ్ పరిధిలోకి తీసుకురావాల్సి ఉండగానే ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఈ భారీ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఇందులో 33 మంది డీఈఓలు, 119 మంది ఈఆర్ఓలు, 867 మంది ఏఈఆర్ఓలతో పాటు 3,596 మంది అబ్జర్వర్లు, 35,985 మంది బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాల్లోని వివరాల ఆధారంగా ఈ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి విచారణ చేపట్టారు. విజయవంతంగా మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియలో ఎలాంటి గుర్తింపులు సమర్పించకపోయినా, వారి పేర్లను తుది జాబితాలో చేరుస్తారు.
ఇప్పటివరకు పూర్తయిన 2.36 కోట్ల మ్యాపింగ్‌లో దాదాపు 89 లక్షల మంది ఓటర్ల వివరాల్లో అధికారులు లోపాలను గుర్తించారు. కొన్ని కుటుంబాల్లోని సభ్యుల వయసుకు, వారి మధ్య ఉన్న సంబంధాలకు భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. పేర్లలో అక్షర దోషాలు కూడా బయటపడ్డాయి. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్యుమరేషన్ పత్రాలను నింపే సమయంలో వీరికి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ సమయంలో ఓటర్లు తమ సరైన గుర్తింపు పత్రాలను చూపిస్తే, తప్పులను సరిదిద్ది తుది జాబితాలో పేరు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు.
మ్యాపింగ్ నిలిచిపోవడంతో ఓటు హక్కుపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి వంటి పట్టణ జిల్లాల్లో మ్యాపింగ్ ప్రక్రియ అధ్వానంగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి. తమ ఇళ్లకు అసలు బీఎల్ఓలే రాలేదని ఓటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులను, స్థానికేతరులను బీఎల్ఓలుగా నియమించడం వల్ల వారికి స్థానిక ప్రాంతాలపై అవగాహన లేక అనేక ఇళ్లను వదిలేశారని తెలుస్తోంది. కొన్నిచోట్ల ఓటర్లు ఇళ్లు మారినప్పుడు వివరాలు సేకరించకుండానే అధికారులు అన్‌మ్యాపింగ్ చేసేశారు.
ఈ ప్రక్రియలో జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 94.47 శాతం ఓటర్ల మ్యాపింగ్ జరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో జనగామ (93.37 శాతం), మెదక్ (88.99 శాతం), సిద్దిపేట (87.53 శాతం), యాదాద్రి భువనగిరి (87.33 శాతం) నిలిచాయి. మరోవైపు పట్టణ ప్రాంతాలున్న జిల్లాలు మ్యాపింగ్‌లో తీవ్రంగా వెనుకబడ్డాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరిలో కేవలం 43.3 శాతం మేర మాత్రమే ఓటర్ల మ్యాపింగ్ జరిగింది. హైదరాబాద్‌లో 46.15 శాతం, రంగారెడ్డిలో 57.78 శాతం, సంగారెడ్డిలో 64.93 శాతం, ఖమ్మంలో 72.98 శాతం మ్యాపింగ్‌తో ఇవి చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఈ గందరగోళంపై ఎన్నికల అధికారులు స్పందించారు. ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మ్యాపింగ్ అనేది కేవలం ముందస్తు సన్నాహక ప్రక్రియ మాత్రమేనని, అసలైన SIR ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పుడు బీఎల్ఓలు మళ్లీ ప్రతి ఇంటికీ వచ్చి ఎన్యుమరేషన్ పత్రాలు ఇస్తారని, వాటిని నింపితే సరిపోతుందని వివరించారు. ఒకవేళ మ్యాపింగ్ కాకపోయినా లేదా వివరాల్లో తప్పులున్నా నోటీసులు ఇస్తామని, సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఓటు హక్కు సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు, నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ వివరాలు, ఎంత మందికి కాలేదనే పూర్తి నివేదికను రాజకీయ పార్టీలకు అందించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గుర్తింపు పొందిన పార్టీలు నియోజకవర్గ ఈఆర్ఓ వద్ద ఈ జాబితాను పొందవచ్చు. ఓటర్లు తమ పేరు మ్యాపింగ్ స్థితిని స్థానిక బీఎల్ఓల వద్ద ఉన్న అధికారిక యాప్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. ఇదివరకే బిహార్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్రియ వివాదాస్పదమై, లక్షలాది ఓట్లు తొలగించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, తెలంగాణలో ఈసీ తదుపరి చర్యలపై అందరి కళ్లూ ఉన్నాయి.








