ఒప్పందానికి అడుగుదూరంలో..?
పశ్చిమాసియాలో శాంతిప్రక్రియ పట్టాలెక్కించేందుకు ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. 24 గంటల్లో ఒప్పందం కుదరనుందన్నట్లు ట్రంప్ ప్రకటించేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని.. తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది.
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేసే దిశగా ఒప్పందం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తప్పుబట్టారు. ‘గతంలో ఒబామా ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఆ దేశం సులభంగా అణ్వాయుధాలు తయారుచేసుకునేలా ఉంది. మా ఒప్పందం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆ దేశ అణు కార్యక్రమానికి అడ్డుగోడగా నిలవనుంది’ అని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేశామని, వారి దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తర్వాతి దశల్లో నాశనం చేస్తామని ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు.
‘‘సరైన సమయంలో..అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మేం ఇరాన్‌లోకి ప్రవేశించి గ్రానైట్ పర్వతాల కింద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తీసుకొస్తాం’’ అని చెప్పారు. ఇరాన్ అణుకేంద్రాలను బి-2 బాంబర్లు నాశనం చేశాయని అన్నారు. దానివల్లే యురేనియం ఆ కుప్పకూలిన కొండల కింద చిక్కుకుపోయిందని తెలిపారు. తీసుకొచ్చిన యురేనియాన్ని శుద్ధి చేయని యురేనియంతో కలిపి ఇరాన్లో లేదా అమెరికాలో నాశనం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.
శాంతి ఒప్పందంపై అంతకుముందు పాకిస్థాన్ కూడా కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు . ఈ చరిత్రాత్మక శాంతి ఒడంబడిక సుస్థిర శాంతికి బలమైన పునాదులు వేస్తుందన్న విశ్వాసం మాకుంది’ అని ‘ఎక్స్’లో షరీఫ్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించలేదు. తాము ఇప్పటికిప్పుడే ఒప్పందంపై సంతకాలు చేయమని ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో చేస్తామేమో. పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే అవతలి పక్షం ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఈ ప్రక్రియపై ఏ ప్రకటనైనా మేం జాగ్రత్తగా ఇవ్వాలి’ అని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ట్రంప్ ప్రకటనకు ముందు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒప్పందానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం లేదని అన్నారు. ప్రాథమిక ఒప్పందం కుదిరిన 60 రోజుల తర్వాత అణ్వాయుధాల అంశంపై చర్చలు జరుగుతాయని తెలిపారు.








