పద్మవ్యూహంలో శుద్ధి చేసిన యురేనియం..అమెరికా ప్లాన్స్ ఏంటో..?
అమెరికా కన్ను శుద్ధి చేసిన యురేనియం ధ్వంసంపై ఉంది. అయితే శాంతి ఒప్పందం లేదంటే బలప్రయోగం చేసైనా ఆ యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ అయితే చీటికి , మాటికి అదే ప్రస్తావన తెస్తున్నారు. ఈనేపథ్యంలో అమెరికా.. తమ దేశంలోని కొంతమందితో కలిసి ఎలాంటి కుట్రైనా చేస్తే.. యురేనియంపై చేయి వేస్తే.. ఇదే అనుమానం ఇరాన్ హైకమాండ్ లోనూ ఉన్నట్లుంది. అందుకే ఐఆర్జీసీ.. ఏకంగా ఓ ప్రమాదకరమైన పద్మవ్యూహాన్ని అమలు చేస్తోంది.
తమ యురేనియంపై అమెరికా చెయ్యి వేయకుండా ఇరాన్ అత్యంత ప్రమాదకర ఉచ్చును పరిచింది. ఎవరూ ఆ యురేనియం దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా ఇరాన్ అడుగుకో గండం చొప్పున సిద్ధం చేసింది. ఇరాన్ అనుమతించినా.. అమెరికా సైన్యానికి అక్కడికి వెళ్లడం ప్రాణాంతకమే.
శుద్ధి చేసిన యురేనియం అమెరికా దళాల చేతిలో పడకుండా ఇటీవల కాలంలో ఇరాన్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఒక వేళ అమెరికాతో చర్చలు సఫలమై.. శుద్ధి చేసిన యురేనియాన్ని ఒక చోటకు చేర్చి ధ్వంసం చేయాల్సిన బాధ్యత ఇరాన్‌పై పడే అవకాశం కూడా ఉంది. దీంతో అలాంటి పరిస్థితుల్లో తమ దళాలు కూడా దాని వద్దకు చేరలేనంత కఠినంగా ఆ యురేనియం నిల్వల వద్ద ఏర్పాట్లు చేస్తోంది. చాలా చోట్ల సొరంగాలను కూల్చేయడం.. వాటి ముఖద్వారాల వద్ద మందుపాతరలు ఇతర పేలుడు పదార్థాలతో ట్రాప్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ యురేనియం వెలికి తీయాలంటే.. భారీ యంత్రాలు, డీమైనింగ్ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒప్పందం ప్రకారం యురేనియం అప్పజెప్పాల్సిన పరిస్థితుల్లో ఇరాన్ కూడా చేతులెత్తేసే అవకాశం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. శుద్ధి చేసిన యురేనియంలో అత్యధిక భాగం ఇస్ఫహాన్‌లోనే ఉండగా.. కొద్దోగొప్పో ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
యురేనియం స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికా మే నెలలో కమాండో ఆపరేషన్‌కు సన్నాహాలు చేసింది. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ దీనిని హడావుడిగా సమీక్షించారు. నాడు ఆయన నాటో అధికారులతో సమావేశం నుంచి అర్ధాంతరంగా ఫ్లొరిడా చేరుకొన్నారు. అప్పట్లో ఈ కమాండో ఆపరేషన్ ప్లాన్‌ను ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వివరించారు.
ఇరాన్ ప్రతిఘటనను దృష్టిలో పెట్టుకొని నాడు ట్రంప్ ఈ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపలేదు. దీనిలో అమెరికా భారీగా ప్రాణనష్టం చవిచూడాల్సి ఉంటుందనే భయం ఆయనలో ఉంది. దీనికి తోడు యురేనియం వాయు (గ్యాస్) రూపంలో ఉంది. దీంతో పాటు ఇరాన్‌కు అనుబంధ గ్రూప్‌లు బాబ్-అల్ మండెప్ జలసంధిని మూసేవేసే ముప్పు పొంచి ఉంది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ముప్పును ఎదుర్కొంటుంది.








