చైనాపై తైవాన్ నిఘా.. ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు..!
ఒకే చైనా విధానంతో ముందుకు సాగుతున్న డ్రాగన్.. బలప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు.. చైనా అధినేత జిన్ పింగ్ స్పష్టం చేశారు. దీంతో .. తైవాన్ అప్రమత్తమైంది. చైనా వ్యవహారాలపై నిఘా పెడుతోంది. నిఘా సంబంధిత సమాచారాన్ని చైనా పౌరులు తమకు సురక్షితంగా చేరవేసేందుకు వీలుగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల నిఘా సంస్థలు అనుసరించే విధానాల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తైవాన్ అధికారులు తెలిపారు.
‘‘ఇటీవల చైనా (China) ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. రాజకీయ నియంత్రణ కఠినంగా కొనసాగుతోంది. సామాజిక, జీవనోపాధి సమస్యలు తీవ్రమయ్యాయి. ఇవన్నీ చైనీయుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ పరిణామాల నడుమ వివిధ రకాల సమాచారాన్ని పంచుకుంటామంటూ చైనా నుంచి తైవాన్‌లోని సంస్థలను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చైనా పౌరులు గూఢచర్యానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వెబ్‌పేజీని ప్రారంభిస్తున్నాం’’ అని తైవాన్ (Taiwan) జాతీయ భద్రతా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
తైవాన్ విషయంలో చైనా కూడా ఈ తరహా ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు గతంలో తెలిపింది. వేర్పాటువాదులను జవాబుదారీగా ఉంచడమే లక్ష్యంగా.. తైవాన్ స్వాతంత్ర్య కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరింది. గతేడాది అమెరికా సైతం చైనా విషయంలో ఇదే తరహా చర్యలు తీసుకుంది. అసంతృప్తితో ఉన్న చైనా అధికారులు సమాచారాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తూ సీఐఏ సోషల్ మీడియాలో మాండరిన్ భాషలో వీడియోలను విడుదల చేసింది.








