సూర్య ‘వీరభద్రుడు’ OTT మూవీ రివ్యూ-దేవుడికి ఛాలెంజ్ విసిరిన లాయర్… చివరికి ఏమైంది?
Rating: 2.5
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మునుస్వామి (ఇంద్రన్)కి ఒకే ఒక్క ప్రపంచం… అదే తన కూతురు మీను (అనఘ మాయ). తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆమెను తీసుకుని నగరానికి వస్తాడు. ఆమె తీవ్రమైన లివర్ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆపరేషన్ చేయించాలంటే భారీ మొత్తంలో డబ్బు కావాలి. అందుకే తన జీవితాంతం కూడబెట్టుకున్న 60 సవర్ల బంగారాన్ని అమ్మి, కూతురి ప్రాణం కాపాడాలని ఆశతో హైదరాబాద్ కు ట్రైన్ ఎక్కుతాడు. కానీ నగరంలో కాలు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే అతని ప్రపంచం తలకిందులైపోతుంది.
నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగగానే దొంగలు దాడి చేసి బంగారం మొత్తం ఎత్తుకెళ్లిపోతారు. కూతురు ప్రాణాలు కళ్ల ముందు కనిపిస్తుంటే, చేతిలో ఉన్న చివరి ఆశ కూడా జారిపోవడంతో మునుస్వామి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడు.పోలీసులు కొంత నొక్కేసి 45 సవర్ల బంగారం మాత్రమే రికవరీ చేస్తారు. ఏమీ చెయ్యలేని పరిస్ధితుల్లో …దాన్ని అయినా తీసుకుందామంటే వెంటనే చేతికి రాదు. “కోర్టు ఆర్డర్ తీసుకురండి” అని చెబుతారు.
అక్కడే రంగంలోకి దిగుతాడు బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ). చూడటానికి తెలివైన చాలా మంచి లాయర్. కోర్టులో అతను వాదిస్తే ఎదుటివాళ్లు వణికిపోతారు. జడ్జిని మేనేజ్ చేస్తాడు. కానీ అసలు విషయం ఏమిటంటే.. అతనికి న్యాయం కంటే డబ్బే ముఖ్యం. మునుస్వామి కూతురు పరిస్థితి తెలిసినా, కేసును త్వరగా ముగించాలనే ఆలోచన ఉండదు. పైగా తన టీమ్ తినే బిర్యానీ బిల్లులు కూడా మునుస్వామితోనే కట్టిస్తుంటాడు.
ఒక రోజు… రెండు రోజులు…ఒక వారం…ఒక నెల…చూస్తుండగానే నాలుగు నెలలు గడిచిపోతాయి.కేసు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. కానీ మీను ఆరోగ్యం మాత్రం ప్రతిరోజూ వెనక్కి వెళ్తుంది. తన కూతురు కళ్ల ముందే కరిగిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ తండ్రిగా మునుస్వామి విరిగిపోతాడు. ఇక మనుషుల మీద నమ్మకం పోయి, కోర్టు ఆవరణలో ఉన్న వీరభద్రస్వామి గుడికి వెళ్లి కన్నీళ్లతో తన బాధ చెప్పుకుంటాడు.
“నా కూతురిని కాపాడు స్వామీ…” అని మొక్కు కుంటాడు. ఆ పిలుపు వింటాడు వీరభద్రుడు.భూమిపైకి దిగివస్తాడు. నేరుగా బేబీ కృష్ణ ముందుకు వెళ్లి హెచ్చరిస్తాడు. “ఇంకా అయినా మారిపో” అంటాడు. కానీ బేబీ కృష్ణ నవ్వేస్తాడు. “నువ్వు దేవుడివైతే నీ శక్తులతో కాదు… ఈ కోర్టులోనే మాతో పోరాడీ, న్యాయం చేసి చూపించు” అని సవాల్ విసురుతాడు. అక్కడి నుంచి సినిమా అసలు ఆట మొదలవుతుంది.
డబ్బు కోసం చట్టాన్ని ఆయుధంగా మార్చుకున్న ఒక లాయర్… అదే చట్టాన్ని ఉపయోగించి న్యాయం చేయాలని వచ్చిన ఒక దేవుడు… ఈ ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్, కోర్టు డ్రామా, ఎమోషనల్ పోరాటం చివరకు ఏ మలుపు తిరిగింది. దేవుడు ఎదురుగా నిలిచినా బేబీ కృష్ణ ఎందుకు భయపడలేదు?
మునుస్వామి కూతురికి చివరికి న్యాయం జరిగిందా?తన బంగారం తిరిగి దక్కిందా? అమాయకుల జీవితాలతో ఆడుకునే వాళ్లకు వీరభద్రుడు ఎలా బుద్ధి చెప్పాడు? అనేవి తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
విశ్లేషణ
ఏ సినిమాలో అయినా ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో ఉంచేది హీరో కాదు… అతని ముందున్న ఛాలెంజ్ అని సినిమా పెద్దలు చెప్తూంటారు.’వీరభద్రుడు’ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఇది నిజమే అని మరోసారి అనిపిస్తుంది. ఒక అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. పేద తండ్రి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.చట్టాన్ని తన జేబులో పెట్టుకున్నట్టు తిరిగే బేబీ కృష్ణ అనే లాయర్ ఉన్నాడు. లాంటి సమయంలో దేవుడు భూమిపైకి దిగుతాడు. ఇడే సినిమా ఇంట్రస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే ఇది సాధారణ “దేవుడు వచ్చాడు – విలన్‌ను కొట్టాడు” కథ కాదు.
ఇది దాదాపు అర్జున్ సూపర్ హిట్ ఒకే ఒక్కడు టైప్ సెటప్, ఛాలెంజ్.”మీరు దేవుడైతే… మీ పవర్స్ వాడకుండా ఈ వ్యవస్థలోనే న్యాయం చేసి చూపించండి” అని దేవుడికే సవాల్ విసురుతాడు బేబీ కృష్ణ.అది అద్భుతమైన ఐడియా.స్క్రీన్‌రైటింగ్ భాషలో దీనిని “Dramatic Premise” అంటారు.
ఒక దేవుడు…ఒక అవినీతి వ్యవస్థ…మధ్యలో ఒక అమాయక చిన్నారి ప్రాణం…ఈ మూడు ఎలిమెంట్స్‌తో గొప్ప కోర్ట్‌రూమ్ డ్రామా రావచ్చు.
ఫస్ట్ హాఫ్ అంతా ఆ హోప్ ఇస్తుంది.ముఖ్యంగా ఇంద్రన్స్, అనఘ పాత్రల వల్ల సినిమా నేల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది.వారి బాధ నిజంగా అనిపిస్తుంది.వారి సమస్య మన సమస్యగా మారుతుంది.ఇంటర్వెల్‌కు ముందు ఇంద్రన్స్ చేసే సన్నివేశాలు చూస్తే ఎందుకు ఆయన గొప్ప నటుడో మరోసారి అర్థమవుతుంది.ఆ బలహీనత…ఆ కోపం…ఆ నిస్సహాయత…అన్నీ ఒకే సీన్లో చూపిస్తాడు.కొన్ని క్షణాల్లో సూర్య లాంటి స్టార్‌ను కూడా మరిపించే స్థాయిలో నిలుస్తాడు.
కానీ…ఇంటర్వెల్ తర్వాత సినిమా నెమ్మదిగా తన అసలు బలాన్ని వదిలేస్తుంది.ఫస్టాఫ్ లో ఉన్న ప్రశ్న ఏమిటి?”దేవుడు వ్యవస్థలోపలే న్యాయం ఎలా చేస్తాడు?” అని. కానీ సెకండాఫ్ లో ఆ ప్రశ్నే కనిపించదు. కథ కంటే హీరో మీద ఫోకస్ పెరుగుతుంది.స్క్రీన్‌ప్లే ముందుకు వెళ్లడం కాదు…హీరో ఎంట్రీలు, స్లోమోషన్లు, పంచ్ డైలాగులు వరుసగా వస్తుంటాయి.దీంతో కథలోని టెన్షన్ మాయమవుతుంది.
ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే…Vikram లో కమల్ హాసన్ ఎంత పెద్ద హీరో అయినా, చివరి వరకు అసలు మిషన్ ఏమిటో ప్రేక్షకుడికి గుర్తుంటుంది.Jailer లో రజనీకాంత్ ఎంత మాస్ చేసినా, కథ ముందుకు కదులుతూనే ఉంటుంది.కానీ ఇక్కడ మాత్రం కథ ఆగిపోతుంది.
హీరో సెలబ్రేషన్ మొదలవుతుంది.ఇది అభిమానులకు నచ్చొచ్చు. స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే ప్రమాదకరం.ఎందుకంటే ప్రేక్షకుడు మొదట ఇన్వెస్ట్ అయినది హీరోలో కాదు…ఆ చిన్నారి ప్రాణాల్లో.ఆ తండ్రి బాధలో.ఆ కోర్టు ఛాలెంజ్‌లో.అవి సైడ్ అయిపోయినప్పుడు సినిమా ఎమోషనల్ కోర్ కూడా బలహీనపడుతుంది.
టెక్నికల్‌గా..
సినిమాటోగ్రాఫర్ G. K. Vishnu ఎరుపు, నలుపు రంగులను ఉపయోగించిన తీరు బాగుంది.సూర్య ఎంట్రీ షాట్లు, కోర్టు విజువల్స్, స్లోమోషన్ బ్లాక్స్ అన్నీ మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సాయి అభ్యంకర్ ఇచ్చిన “కరప్పా” ట్రాక్ వినిపించిన ప్రతిసారి తెరపై ఎనర్జీ పెరుగుతుంది. ఇక సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఆయన కళ్లలో ఉండే ఇంటెన్సిటీ ఈ పాత్రకు చాలా ఉపయోగపడింది.నడక, చూపు, డైలాగ్ డెలివరీ, ఫైట్ సీక్వెన్స్‌లు అన్నింటిలోనూ ఆయన స్టార్ ప్రెజెన్స్ కనిపిస్తుంది.
ఫైనల్ థాట్
వీరభద్రుడు ఒక గొప్ప కథగా మారే అవకాశాన్ని కలిగి ఉన్న సినిమా. కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా, సేఫ్ మాస్ ఫార్ములా వైపు మళ్లిపోయింది. అందుకే థియేటర్ నుంచి బయటకు వచ్చాక మనసులో మిగిలేది ఒక ప్రశ్న…
“దేవుడి కథ చెప్పాలనుకున్నారా… లేక దేవుడిలా కనిపించే హీరో కథ చెప్పాలనుకున్నారా?”
ఎక్కడ చూడచ్చు
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది








