డీజిల్ వినియోగంపై కేంద్రం కొత్త ఆంక్షలివే..
డీజిల్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన గైడ్ లైన్స్ జారీ చేసింది. పెట్రోల్ బంకుల్లో డీజిల్ అమ్మకాలపై పరిమితి విధించింది. ఒక వాహనానికి లేదా ఓ వ్యక్తికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. బంకుల్లో ఆ ఇంధనాన్ని కూడా నేరుగా వాహనంలో పోస్తారు. లేదా పెసో ఆమోదం పొందిన కంటెయినర్లలో పోస్తారు. అంతే తప్ప, మామూలు ప్లాస్టిక్ కంటెయినర్లలో డీజిల్ నింపరు. అలా పోయించుకున్న డీజిల్ ను వేరొకరికి విక్రయించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అలాగే పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం పెద్ద ఎత్తున డీజిల్ కొనుగోలు చేసేవారు పెట్రోల్ లేదా డీజిల్ ను సాధారణ ప్రజల తరహాలో నేరుగా రిటైల్ ఔట్ లెట్లకు వెళ్లి, పోయించుకోవడానికి అనుమతించరు. ఆ తరహా సొంత సంస్థ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బంకుల ద్వారా మాత్రమే తమకు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చుకోవాల్సి వుంటుంది.
ప్రస్తుతం బల్క్ వినియోగదారులకు విక్రయిస్తున్న డీజిల్ లీటరు 134.50 పైసలు కూాగా, బంకుల్లో లీటర్ డీజిల్ ధర 95.20 గా వుంది. ధరల్లో ఇంత తేడా వుండటంతో చాలా మంది బల్క్ వినియోగదారులు నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ ఔట్ లెట్లకు వెళ్లి డీజిల్ పోయించుకుంటున్నారు. దీని వల్ల సాధారణ వినియోగదారులకు కొరత ఏర్పడుతోంది. చమురు సంస్థలకు నష్టాలు కూడా వస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ కొత్త రూల్స్ తెచ్చింది.








