ఇంధన రంగంలో స్వయంసమృద్ధి.. E 85 ఇంధనం అందుబాటులోకి
దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ‘ఇ-85’ ఇంధనాన్ని ప్రారంభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిటైల్ ఔట్లెట్లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ కొత్త ఇంధనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
దీని ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేసినట్లైంది. ఇ-85 ఇంధనంలో 80-85 శాతం ఇథనాల్, 14-19 శాతం పెట్రోల్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లతో కూడిన వాహనాల కోసం రూపొందించడం జరిగింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీని ధర లీటరుకు దాదాపు రూ.20 తక్కువగా ఉండటం వినియోగదారులకు పెద్ద ఊరట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 48 ఫ్యూయల్ స్టేషన్లలో ఇ-85ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దశలవారీగా ఈ సంఖ్యను పెంచనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 500, 2027 డిసెంబర్ నాటికి 5,000 రిటైల్ ఔట్లెట్లలో ఇ-85ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. ఇంధన లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే మూడు అంశాలను భారత్ విజయవంతంగా సమన్వయం చేస్తోందన్నారు. 2014లో కేవలం 1.53 శాతంగా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్‌ను, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే 20 శాతం లక్ష్యానికి చేర్చామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.1.84 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, సుమారు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని వివరించారు.
E85 ఇంధనం అనేది 85% ఇథనాల్, 15% పెట్రోల్‌తో కూడిన మిశ్రమం. పర్యావరణ పరిరక్షణ మరియు ముడి చమురు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో భారతదేశంలో దీన్ని ప్రవేశపెట్టారు.
ధర మరియు లభ్యత: సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే E85 లీటరుకు దాదాపు రూ. 20 చౌకగా లభిస్తుంది. దిల్లీలో దీని ధర రూ. 82.12గా ఉంది. ప్రస్తుతం ఇది పరిమిత కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.
వాహనాలు (ఫ్లెక్స్-ఫ్యూయల్): సాధారణ పెట్రోల్ ఇంజిన్లు ఈ ఇంధనంతో నడవలేవు. E20 (20% ఇథనాల్) తో నడిచే కార్లు కూడా E85 వాడటానికి అనర్హమైనవి. దీనిని వాడటానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వెహికల్స్ (FFV) అవసరం.








