రాజ్యసభకు 24 మందీ ఏకగ్రీవం.. మధ్యప్రదేశ్ లో కీలక మలుపు
రాజ్యసభకు 24 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 18 న జరగాల్సిన రాజ్యసభ ద్వైవార్షిక, ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ఏకగ్రీవం జరిగింది. 10 రాష్ట్రాలు, 24 స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన గురువారంతో అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగిసింది. దీంతో 10 రాష్ట్రాలలోని 24 స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో బీజేపీ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు, మేఘాలయాలోని ఎన్సీపీ, మహారాష్ట్రలో ఎన్సీపీ నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తంగా చూస్తే ఎన్డీయే కూటమి నుంచే 18 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మధ్యప్రదేశ్ లోనే రాజ్యసభ ఎన్నికలు కీలక మలుపు..
మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు కీలక మలుపు తిరగాయి. తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో శుక్రవారం దీనిపై విచారణ జరగనుంది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు బీజేపీ అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తరుణ్ ఛుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ కెవట్ లకు భోపాల్ లో అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. 230 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో రాజ్యసభ సభ్యునిగా గెలిచేందుకు ఒక్కొక్కరికి 58 ఓట్లు అవసరం. ఆ ప్రకారం రెండింటినీ బీజేపీ, ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ వున్నా.. మీనాక్షి నామినేషన్ చెల్లలేదు. దీంతో ఆ సీటు బీజేపీ వశమైంది.








