బీజేపీకి ఉప్పందించిన ఆ కాంగ్రెస్ నేతలెవరు?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వెన్నుపోటు రాజకీయాలు కొత్తేమీ కాదు. కానీ, ఒక జాతీయ స్థాయి నాయకురాలి ఎదుగుదలను దెబ్బతీయడానికి, ఏకంగా ప్రత్యర్థి పార్టీకి రహస్యాలను చేరవేసే స్థాయికి సొంత పార్టీ నేతలే దిగజారడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ మధ్యప్రదేశ్ లో తిరస్కరణకు గురైంది. అయితే దీని వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్‌వర్గియా బాంబు పేల్చారు. ఇదిప్పుడు టీ కాంగ్రెస్‌లో పెను భూకంపం సృష్టిస్తోంది.
“మీనాక్షీ నటరాజన్‌పై తెలంగాణలో కేసులు ఉన్నాయనే విషయం మాకు తెలియనే తెలియదు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలే మాకు ఆ సమాచారంతో పాటు కేసు పత్రాలను కూడా అందించారు” అంటూ విజయ్‌వర్గియా మంగళవారం మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని, ఆ పార్టీలోని బాధ్యతారాహిత్యాన్ని సమాజం ముందు ఉంచాయి. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ కాంగ్రెస్ నేతలే ప్రధాన కారకులు అనే కోణం ఇప్పుడు స్పష్టమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ నమోదైన కేసుల వివరాలు, పక్కా లీగల్ డాక్యుమెంట్లు పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతల చేతుల్లోకి వెళ్లాయంటే.. అది తెలంగాణ కాంగ్రెస్ పెద్దల సహకారం లేకుండా సాధ్యం కాదు.
మీనాక్షి తన నామినేషన్ అఫిడవిట్లో తెలంగాణలోని కేసుల వివరాలను దాచిపెట్టారనే సాకుతో ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించేలా వ్యూహం రచించింది బీజేపీ కాదు, సొంత పార్టీలోని కోవర్టులే అనేది బహిరంగ రహస్యం. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమెకు సరైన లీగల్ గైడెన్స్ ఇవ్వకపోవడం లేదా కేసుల విషయాలను కావాలనే తొక్కిపెట్టి, సమయం చూసి ప్రత్యర్థి పార్టీకి సమాచారం అందించడం చూస్తుంటే ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు అర్థమవుతోంది.
మీనాక్షీ నటరాజన్‌కు రాజ్యసభలో చోటు దక్కకపోవడానికి కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు మాత్రమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. పార్టీలో ఒక వర్గం ఎదుగుతుంటే, మరో వర్గం సహించలేక కాళ్ళు లాగే సంస్కృతి కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఉంది. మీనాక్షి లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న జాతీయ నాయకురాలిని పార్లమెంటుకు పంపడం ఇష్టం లేని కొందరు హస్తం నేతలు, తెలంగాణ నుంచి చక్రం తిప్పినట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల వద్ద మీనాక్షికి ఉన్న పట్టును తగ్గించడానికి, ఆమెను రాజకీయంగా దెబ్బతీయడానికి సొంత పార్టీ నేతలే బీజేపీతో చేతులు కలపడం కాంగ్రెస్ నైతిక పతనానికి అద్దం పడుతోంది. మీనాక్షిని ఒంటరిని చేసి, ఆమె పొమ్మనలేక పొగబెట్టేందుకే ఈ కోవర్ట్ రాజకీయాలకు తెరతీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక జాతీయ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకురాలి నామినేషన్ పత్రాల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వహించడం కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తమ పార్టీ అభ్యర్థిపై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి? అఫిడవిట్లో ఎలాంటి సమాచారం పొందుపరచాలి? అనే కనీస స్క్రీనింగ్ కూడా చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ లీగల్ సెల్ ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతకంటే ఘోరం.. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే, సొంత పార్టీ ఇన్చార్జికి వ్యతిరేకంగా అధికారిక పత్రాలు లీక్ కావడం. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం కాదు, వ్యవస్థాగతంగా కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో, క్రమశిక్షణారాహిత్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
బీజేపీకి ఉప్పు అందించిన ఆ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కోవర్టులను ఏరిపారేయకపోతే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే సమాధి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.








