విలీనమా? అబ్బే అదేం లేదు : కేసీ వేణుగోపాల్
కొన్ని రోజులుగా తృణమూల్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతోందన్న వార్తలు భారీగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో కూడా భేటీ అయ్యారు. దీంతో ఈ వార్తకు మరింత ఊతమిచ్చింది. అయితే దీనిపై కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. విలీనంపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఇద్దరూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అది ఓ సాధారణ సమావేశమేనని స్పష్టం చేశారు. అసలు విలీనం గురించి చర్చలే జరగలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యాచరణను స్వతంత్రంగా కొనసాగిస్తోందని, టీఎంసీ కూడా తన పార్టీ విధానాల ప్రకారమే ముందుకు సాగుతోందని తెలిపారు. ఈరోజు (గురువారం) ఢిల్లీ ఇందిరా భవన్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మీడియాతో కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.
బెంగాల్ లో ఘోర పరాభవం తర్వాత తృణమూల్ పార్టీ పట్టు తప్పిపోయింది. పరాభవం రోజు తర్వాతి నుంచే ఆ పార్టీ నేతలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఆ పార్టీ కీలక నేత అభిషేక్ పై దాడి జరగడంతో పాటు, ఏకంగా 20 మంది ఎంపీలు ఎన్డీయేలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు కూడా పార్టీపై ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ లో పార్టీని నడపడం కష్టమని మమతా భావించారని, అందుకే కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి.








