ప్రజలే దైవం.. మధ్య తరగతిని జాగ్రత్తగా చూసుకోవాలి : ప్రధాని మోదీ
ప్రజలే తనకు దైవ స్వరూపులని, మధ్యతరగతి వర్గం వెనుకబడుపోకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు మనపై ఉన్న అంచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాంగ్రెస్ పాలనలో భారీ జనాభాపై ‘హిందూ వృద్ధి రేటు’అనే ముద్ర వేశారని విమర్శించారు.ఆ మందకొడి వృద్ధి రేటుకు “హిందూ వృద్ధి రేటు” అని పేరు పెట్టారు. దేశంలోని అధిక హిందూ జనాభాపై ఈ ముద్ర వేశారు; జనాభా ఎక్కువగా ఉండటం వల్లే వృద్ధి రేటు తక్కువగా ఉందని వాదించారని పేర్కొన్నారు.వాస్తవానికి, ఈ పరిణామానికి “కాంగ్రెస్ వృద్ధి రేటు” అని పేరు పెట్టి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు.
ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
కాంగ్రెస్ దేశాన్ని నిస్సహాయత, దారిద్ర్యం, న్యూనతా భావం అన్న అగాధంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. భారతదేశంలో అభివృద్ధి అనివార్యంగా నత్తనడకన సాగుతుందని, ఇక్కడ వేగవంతమైన వృద్ధి అసాధ్యమని నమ్మేలా దేశాన్ని మానసికంగా సిద్ధం చేశారని పేర్కొన్నారు.
ఎంతో చాకచక్యంగా ఈ మందకొడి వృద్ధికి “హిందూ వృద్ధి రేటు” (Hindu Growth Rate) అని పేరు పెట్టారు; దీనివల్ల విధానం, బాధ్యత మరియు వైఫల్యం అన్నీ కాంగ్రెస్ పార్టీవే అయినప్పటికీ, ఆ అపవాదు మాత్రం దేశంలోని అత్యధిక సంఖ్యలో ఉన్న హిందూ జనాభాపై పడేలా చేశారని విరుచుకుపడ్డారు.పరిపాలన, విధానం, చిత్తశుద్ధి మరియు నిర్ణయాత్మకత వంటివి ఏమాత్రం లేకపోవడమే ఈ “కాంగ్రెస్ వృద్ధి రేటు” యొక్క ప్రధాన లక్షణమని విమర్శించారు.
అటల్ జీ నాయకత్వంలోనే ఎన్డీయే (NDA) ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది; అప్పుడే వేగవంతమైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మనం చూడగలిగామని మోదీ గుర్తు చేశారు.అయితే దురదృష్టవశాత్తు, 2004లో ఆ దేశం మరోసారి అస్థిరత సుడిగుండంలోనూ, కాంగ్రెస్ గుప్పిట్లోనూ చిక్కుకుపోయిందని మోదీ అన్నారు.
NDA అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలంలో సాధించిన ఒక ప్రధాన విజయం ఏమిటంటే, దేశం కాంగ్రెస్ కుట్రల వలయం నుండి బయటపడిందన్నారు. నేడు, దేశంలోని ప్రతి పౌరుడు ‘వికసిత్ భారత్’అన్న దాంతో ముడిపడి వున్నాడని తెలిపారు. అయితే వికసిత్ భారత్ అన్న స్వప్నం ఏ ఒక్క వ్యక్తికో, ప్రభుత్వానికో, పార్టీకో పరిమితం కాదని, ఇది దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి స్వప్నంగా, కలగా మారిందన్నారు. ఈ స్వప్నాన్ని సాకారం చేయడానికి అందరూ ప్రతి క్షణాన్నీ అంకితం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
నిన్నటి వరకు పేదలుగా ఉండి, ఇప్పుడు ‘నవ మధ్యతరగతి’గా మారిన వారు తిరిగి వెనుకబడిపోయేలా మనం చేయకూడదని, అందుకే ఎన్డీయే పక్ష నేతలు రాత్రింబవళ్లు పనిచేయాలని సూచించారు. 140 కోట్ల మంది ప్రజలు మనపై ఉంచిన ఆశలను నెరవేర్చాలనే సంకల్పంతో మేము అపారమైన కృషి చేశాము. భారతదేశ యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలు మరియు రైతుల ఆకాంక్షలను మనం సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
2014లో భారత్ తనకు అవసరమైన మొబైల్ ఫోన్లలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకునేది. నేడు భారత్ దేశీయంగా 330 మిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్సెట్లను తయారు చేస్తోందని గుర్తు చేశారు. 2014లో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2.5 గిగావాట్లుగా ఉండేది; నేడు అది 150 గిగావాట్లకు పైగా ఉందన్నారు. 2014లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండగా, నేడు అది 20%కి చేరుకుంది. 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ యూనిట్ కూడా లేదు; కానీ నేడు, నిర్మాణ దశలో ఉన్న 10కి పైగా సెమీకండక్టర్ యూనిట్లు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.








