పశ్చిమాసియాలో భీకరయుద్ధం.. ! హర్మూజ్ బంద్..!
శాంతి ఒప్పందానికి ఇరాన్ సరిగ్గా సహకరించడం లేదంటూ ఆగ్రహించిన అమెరికా .. మరోసారి భీకర దాడులకు దిగింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న ట్రంప్ సర్కార్..వరుసగా రెెండోరోజూ ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ప్రతిగా.. అమెరికా బలగాలకు ఆతిథ్యమిస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులు చేసింది. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్న టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది. ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగాయి. మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై ప్రధానంగా దాడులు జరిగాయి. మరోవైపు కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని ఇరాన్ కొట్టిపారేసింది. ఈవిడతలో దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
హర్మూజ్ జలసంధిని అన్నిరకాల నౌకలకు మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. రెండు చమురు ట్యాంకర్లపై కూడా ఐఆర్జీసీ దళాలు దాడులు చేశాయి. వాటికి అమెరికా యుద్ధనౌకలు సాయపడుతున్నట్లు ఆరోపించాయి. మరోవైపు కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్‌బేస్, కువైట్‌లోని అలీఅల్సలీమ్ ఎయిర్‌బేస్‌లపై డ్రోన్లు దాడి చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది.
తమ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చేసినందుకు ఇరాన్‌పై ప్రతీకార దాడులు తప్పవని మంగళవారం ట్రంప్ చేసిన హెచ్చరికకు తగ్గట్టే.. అమెరికా యుద్ధ విమానాలు భీకరంగా బాంబింగ్ చేస్తున్నాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేశాయి. బందర్ అబ్బాస్ నగరం, కెష్మ్ దీవి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు జరిగాయని టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే తమకు ఎంత నష్టం వాటిల్లిందో మాత్రం తెలియజేయలేదు.








