SIRపై టీపీసీసీకి తలంటిన హైకమాండ్!
తెలంగాణలో అధికారం చేపట్టి నవ శకానికి నాంది పలికామని మురిసిపోతున్న కాంగ్రెస్ నాయకత్వానికి, కేడర్‌కు ఎఐసిసి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం నడపడం ఒక ఎత్తైతే… పార్టీని సజీవంగా, సమర్థవంతంగా ఉంచడం మరో ఎత్తు అనే ప్రాథమిక సూత్రాన్ని మరిచిన కొందరు నేతల వైఖరిపై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న మందకొడితనంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలుమార్లు SIR ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ.. కేడర్‌ను, ప్రజాప్రతినిధులను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. అర్హులైన పేద ఓటర్ల నమోదు, తప్పుడు ఓట్ల తొలగింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని సీఎం పదేపదే హెచ్చరించారు. అయితే, ఆయన మాటలను సొంత పార్టీ నేతలే పెడచెవిన పెట్టారనేది బహిరంగ రహస్యం. సీఎం ఆదేశాలకే దిక్కులేకుండా పోయిందనే వార్తల నేపథ్యంలో, ఇప్పుడు ఏఐసీసీ అగ్రనాయకత్వం నేరుగా రంగంలోకి దిగి క్లాస్ తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం కేవలం సాధారణ సమీక్షకు మాత్రమే పరిమితం కాలేదు. పార్టీ లోపాలను ఎండగట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరైన ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ సమర్పించిన గ్రౌండ్ రిపోర్ట్ కాంగ్రెస్ నేతల పనితీరును బహిర్గతం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించిన అనంతరం మీనాక్షి నటరాజన్ ఈ నివేదికను రూపొందించారు.
మీనాక్షి నటరాజన్ నివేదికలో పలు సంచలనాత్మక అంశాలను పొందుపరిచినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు మధ్య ఏమాత్రం పొసగడం లేదని, శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులను పూర్తిగా పక్కన పెడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు, మండల్ కాంగ్రెస్ కమిటీలు మందకొడిగా పనిచేస్తుండటంతో ఓటర్ల జాబితా సవరణ ఆశించిన స్థాయిలో సాగడం లేదని అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేడర్ ఘోరంగా విఫలమవుతోందని హెచ్చరించింది.
మరోవైపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ, ప్రక్షాళనపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయి. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, పదవుల కోసం తీవ్ర పోటీ తీవ్రరూపం దాల్చాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పదవులు ఇవ్వొద్దని, పనితీరు సరిగ్గా లేని మంత్రులను పదవుల నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానానికి వినతులు వెళ్లాయి. అధికార దాహంతో ఉన్న నేతలకు పదవులు కావాలంటే ముందు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి చూపించాలని కండిషన్ పెట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటివరకు కొన్ని అంశాల్లో సమర్థవంతంగా పనిచేసిందని మహేష్ కుమార్ గౌడ్ ను కేసీ వేణుగోపాల్ ప్రశంసించారు. అయితే అది పైపైన మెరుగు మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇవాళ జరిగే టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో SIR ప్రక్రియనే ప్రధాన ఎజెండా అని అధిష్టానం తేల్చిచెప్పింది. దీన్నిబట్టి దీనిపై హైకమాండ్ ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేదలు, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఏఐసీసీ హెచ్చరించింది. ముఖ్యమంత్రి పదేపదే చేసిన హెచ్చరికలను లైట్ తీసుకున్న నేతలకు, ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన సీరియస్ డోస్ కళ్ళు తెరిపిస్తుందో లేదో వేచి చూడాలి.








