ఎప్పుడు కూలుతుందో.. ఎవరిపై పడుతుందో..! గ్రేటర్ పరిధిలో 377 శిథిల భవనాల గుర్తింపు..
హైదరాబాద్: మహానగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎప్పుడు ఏ పాత భవనం లేదా ప్రహరీ గోడ కూలిపోతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మాణంలో ఉన్న సెల్లార్ల వద్ద మట్టి దిబ్బలు కూలి కార్మికులు చిక్కుకుపోయే ప్రమాదాలు పొంచి ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నగర ప్రధాన ప్రణాళికాధికారి కె. శ్రీనివాస్ జోన్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారుల నుండి సేకరించిన వివరాల ప్రకారం, జూన్ 5 నాటికి నగరవ్యాప్తంగా మొత్తం 377 శిథిల భవనాలు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సర్వే ఇంకా కొనసాగుతోందని, మరిన్ని భవనాలను గుర్తిస్తామని గ్రేటర్ టౌన్ ప్లానింగ్ విభాగం వెల్లడించింది.
రాజేంద్రనగర్ జోన్లోనే అత్యధికం
బల్దియా సర్వే గణాంకాల ప్రకారం.. శిథిల భవనాలు అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్ పరిధిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జోన్ల వారీగా గుర్తించిన శిథిల భవనాల వివరాలు ఇలా ఉన్నాయి:
రాజేంద్రనగర్: 117 భవనాలు
శేరిలింగంపేట: 75 భవనాలు
సికింద్రాబాద్: 70 భవనాలు
చార్మినార్: 56 భవనాలు
గోల్కొండ: 47 భవనాలు
ఖైరతాబాద్: 12 భవనాలు
కమిషనర్ కఠిన ఆదేశాలు.. సెల్లార్ల అనుమతులు రద్దు!
ప్రమాదాల నివారణకు బల్దియా కమిషనర్ సర్కిళ్ల ఉపకమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాత కట్టడాలు, బలహీనమైన గోడలను గుర్తించి, అవసరమైన వాటికి ఇంజనీరింగ్ నిపుణులతో సామర్థ్య పరీక్షలు చేయించాలని సూచించారు. ఏదైనా భవనం నివాసయోగ్యం కాదని తేలితే ఆ ఇంటిని వెంటనే సీజ్ చేయాలని, ముందుగా యజమానులకు నోటీసులు ఇచ్చి, అత్యవసరమైతే తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. ప్రమాదకర భవనాల చుట్టూ బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలు ఏవైనా శిథిలావస్థలో ఉంటే, వెంటనే విద్యాశాఖకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వర్ష కాలం పూర్తయ్యే వరకు కొత్త సెల్లార్ల తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని, పాత అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
వాలు ప్రాంతాలపై ప్రత్యేక నజర్
నగరంలోని కొండలు, గుట్టలపై ఏర్పడిన అనేక కాలనీలలో ఏటా ప్రహరీ గోడలు కూలిపోయే సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ ప్రాంతాల్లోని ఏటవాలు నేలపై కట్టే ప్రహరీ నిర్మాణాలను వెంటనే ఆపేయాలని జీహెచ్ఎంసీ కోరింది. అక్కడ పనిచేసే కార్మికుల రక్షణ కోసం ఎత్తయిన ప్రాంతాలలో కాకుండా సురక్షితమైన ఖాళీ స్థలాలలో మాత్రమే షెడ్లు నిర్మించాలని కమిషనర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.








