బంగ్లా రోహింగ్యా క్యాంపుల్లో ఉగ్ర కార్యకలాపాలు..!
మయన్మార్ లో సైనిక దాడులతో పెద్దఎత్తున రోహింగ్యాలు.. బంగ్లాదేశ్ లో ఆశ్రయం పొందుతున్నారు. వీరి సంఖ్య దాదాపు 10 లక్షల వరకూ ఉంటుందని అంచనా. వీరు స్థానిక కాక్స్ బజార్ ప్రాంతంలోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మానవతా సాయం ముసుగులో పాక్ , టర్కీకి చెందిన కొన్ని అంతర్జాతీయ ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు (NGOs) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఒక నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. వారిలో ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నట్లు సదరు కథనం వెల్లడించింది.
బంగ్లాదేశ్ వార్తాపత్రిక ‘సోనార్ బంగ్లా’ ప్రచురించిన కథనం ప్రకారం.. గత రెండేళ్లుగా ఈ స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ హయాంలో పాకిస్థాన్, టర్కీలకు చెందిన సీనియర్ సైనిక నిఘా అధికారులు ఈ ప్రాంతంలో సర్వేలు కూడా నిర్వహించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. సుమారు పది లక్షల మందికి పైగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా సంక్షోభాన్ని కొన్ని సంస్థలు తమ రాజకీయ, సైద్ధాంతిక ప్రయోజనాల కోసం పావుగా వాడుకుంటున్నాయని పేర్కొంది.
ఇస్లామిక్ రిలీఫ్, ముస్లిం ఎయిడ్, మెర్సీ మలేషియా, ఎస్కేబీ (స్మాల్ కైండ్నెస్ ఆఫ్ బంగ్లాదేశ్) వంటి పలు సంస్థల పేర్లను ఈ నివేదికలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఎస్కేబీ సంస్థకు జమాత్-ఎ-ఇస్లామీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలను స్థానికులు ‘పాక్-టర్కీ శకం’గా అభివర్ణిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదుల చొరబాట్లపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ సంక్షోభాన్ని కొనసాగించడం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, రోహింగ్యాలను తిరిగి తమ స్వదేశానికి పంపే ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని ‘రోహింగ్యా రిపాట్రియేషన్ స్ట్రగుల్ కమిటీ’ చైర్మన్ హమీదుల్ హక్ చౌదరి ఆరోపించారు. ఈ సంస్థల కార్యకలాపాలపై కఠిన నిఘా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.








