ఐ లవ్ ద్రవ్యోల్బణం.. ట్రంప్ రూటే సెపరేట్..!
ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మిస్సైల్స్ పేలుతున్నాయి. డ్రోన్ దాడులు పెరిగిపోతున్నాయి. దీంతో హర్మూజ్ పూర్తిగా బంద్ అయిన పరిస్థితి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలు పెరిగిపోయాయి. ప్రపంచదేశాలన్నీ ద్రవ్యోల్బణ భయంతో వణికిపోతున్నాయి. దీని ప్రభావం ప్రజలపైనా పడింది. పెరిగిన ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం.. అసలు ఆభయమే అక్కర్లేదన్నట్లు మాట్లాడుతున్నారు.
పశ్చిమాసియా ఘర్షణలతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు ముసురుకున్నాయి. ఇప్పటికే భారత్తో సహా పలు దేశాల్లో ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు మంటలతో అమెరికాలో మే నెల ద్రవ్యోల్బణ గణాంకాలు (Inflation) మూడేళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. అసలు ఆ భయాలే అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. ‘‘గణాంకాలు బాగున్నాయి. ద్రవ్యోల్బణం అంటే నాకు చాలా ఇష్టం’’ అని వ్యాఖ్యానించారు.
అమెరికాలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (Consumer Price Index) 4.2 శాతానికి పెరిగింది. ఏప్రిల్ 2023 తర్వాత ఇదే అత్యధికస్థాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను లెక్కచేయనివిధంగా ఆయన మాటలు ఉన్నాయని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ‘‘ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని ట్రంప్ చెప్తున్నారు. ఆయన మాటలు ప్రతిఒక్కరూ చూడాలి’’ అని డెమోక్రాటిక్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టింది.
నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీకి అస్త్రంగా మారాయి. ఆయన మాటలను విపక్ష నేతలు వక్రీకరించారంటూ రిపబ్లికన్ పార్టీ నేత మైక్ జాన్సన్ నష్టనివారణకు దిగినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా.. ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విదానాలపై సగటు అమెరికన్ అసంతృప్తితో ఉన్నాడు. దీనికి తోడు మళ్లీ సైనికదాడులు పెరగడం.. మరింత ఆందోళనకు కారణమవుతోంది.








