భారతీయులున్న నౌకలపై దాడులు వెంటనే ఆపండి : భారత్ తీవ్ర హెచ్చరిక
భారతీయులున్న నౌకలపై వరుసగా అమెరికా దాడులు చేయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, తక్షణమే వాటిని ఆపేయాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో భారత నావికులే లక్ష్యంగా కొన్ని ఘటనలు జరుగుతున్నాయని, ఒమన్ తీరంలో ఒక నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించామన్నారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయుల్ని కోల్పోయాని విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అమెరికా అంబాసిడర్ ని పిలిపించి, తమ నిరసన కూడా తెలియజేశామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరంగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.చర్చలు, దౌత్యలతో ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేయాలని సూచించారు.
అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భారతీయుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఇప్పటికే భారతీయులున్న ఓ నౌకపై అమెరికా మిసైళ్ల వర్షం కురిపించడంతో, అందులోని ముగ్గురు ఇండియన్ నావికులు మృతిచెందారు. ఆ ఘటన మరువక ముందే మరో వాణిజ్య నౌకపై కూడా అమెరికా సైనికులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఒమాన్‌లోని షినాస్ పోర్టు సమీపంలో భారతీయులు ఉన్న మరో నౌకపై దాడి జరిగినట్లు భారత రాయబార కార్యాలయం గురువారం వెల్లడించింది.
నౌకపై జరిగిన దాడి ఘటనపై తాము నిశితంగా నిఘా ఉంచామని, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్థానిక అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామని ఒమాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.ఇప్పటికే రెండు నౌకలపై అమెరికా దాడులు చేపట్టింది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో భారతీయ సిబ్బంది ఉన్న సెట్టెబెల్లో నౌకపై అమెరికా బలగాలు బుధవారం దాడి చేశాయి. అందులో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మందిని రక్షించారు. ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందినట్లు కేంద్ర మంత్రి గురువారం అధికారికంగా ప్రకటించారు.








