నౌకలపై దాడులు ఉద్దేశపూర్వకంగానే జరిగాయి : హ్యుమన్ రైట్స్ వాచ్ రిపోర్టు
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర దాడులకు దిగాయి. దీంతో హర్మూజ్ జలసంధిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో చమురు విషయంలో ప్రపంచంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరాన్ దళాలు హర్మూజ్ జలసంధి, పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే నౌకలే లక్ష్యంగా దాడులకు దిగింది. అయితే… దీనిపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఓ రిపోర్టు తీసుకొచ్చింది. ఇరాన్ దళాలు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేశాయని పేర్కొంది. ఇలా చేయడం యుద్ధ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
మార్చి 11 న విష్ణు, థాయ్ లాండ్ లోని షిప్పింగ్ కంపెనీకి చెందిన మయూరీ నారీ అనే రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు దాడులు చేశాయి. ఇది తమ పనేనని ఇరాన్ దళాలు ప్రకటించాయన్న విషయాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ గుర్తు చేసింది. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేసింది. అలాగే ఈ నెల 1 నుంచి 17 వ తేదీ వరకు హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లలో మొత్తం 16 సార్లు దాడులు జరిగాయని, 17 నౌకలకు నష్టమైందని కూడా రిపోర్టు పేర్కొంది. యుద్ధంలో పౌరులు, వారి మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.








