Crude Oil: చమురు ధరలు 150 డాలర్ల మార్కును తాకితే.. ప్రపంచ దేశాలన్నీ మాంద్యం కోరల్లోనే
Crude Oil: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవితవ్యంపై అమెరికా అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం ‘బ్లాక్రాక్‘ (BlackRock) సీఈవో లారీ ఫింక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముడిచమురు ధరలు పెరిగితే ప్రపంచం మరోసారి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విశ్లేషణ చేశారు.
150 డాలర్లకు చేరితే ముప్పే:
పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ నుండి పొంచి ఉన్న ముప్పు కొనసాగి, చమురు ధరలు బ్యారెల్కు 150 డాలర్లకు చేరితే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని లారీ ఫింక్ హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న ఘర్షణలు చివరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనే దానిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ ఆంక్షలు తొలగితే ఊరట:
ఒకవేళ పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిసి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్ను ప్రపంచ మార్కెట్ ఆమోదిస్తే.. చమురు ధరలు యుద్ధానికి ముందున్న స్థాయి కంటే దిగువకు పడిపోయే అవకాశం ఉందని ఫింక్ వివరించారు. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పర్యవసానాలు:
అలాకాకుండా యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగి, చమురు ధరలు 100 డాలర్ల మార్కును దాటి 150 డాలర్ల వరకు చేరుకుంటే పరిస్థితి విషమిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ధరలు సుదీర్ఘకాలం పాటు ఇదే స్థాయిలో కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురవుతుందని, ఫలితంగా దేశాలన్నీ ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుంటాయని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరల నియంత్రణే ప్రపంచ ఆర్థిక సుస్థిరతకు అత్యంత కీలకమని లారీ ఫింక్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








