మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష
ఉండవల్లి: మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ ప్రతిపాదనలను పవర్ పాయింట్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి లోకేష్ కు వివరించారు. ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంట మండపం పునర్ నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి సమావేశంలో మంత్రి ఆమోదం తెలిపారు. ఆయా జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులను ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఆలయం వెలుపల చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపైనా మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, భక్తులు సంతృప్తి చెందేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రూ.6 కోట్ల వ్యయంతో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పలు జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. జులై 3వ తేదీన ఆయా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాతల నుంచి విరాళాలా సేకరణపైనా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ ఇంజనీర్ జి.శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ మోహన్, వాస్తుశిల్పి పరమేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.








