రాష్ట్రాల అభివృద్ధితోనే ‘‘వికసిత భారత్’’ : నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని
ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, అనిశ్చితి, అస్థిర పరిస్థితులు నెలకున్నా… భారత్ అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం నీతి ఆయోగ్ పాలక మండలి 11 వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వికసిత భారత్ లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ.. రాష్ట్రాల సమష్టి బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధి కాకుండా వికసిత భారత్ సాధ్యమే కాదన్నారు. పాలనలో ఏఐ సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలని, సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే ఎల్ నినో పరిస్థితుల వల్ల కలిగే ప్రమాదాలను కూడా మోదీ ప్రస్తావించారు. మరింత పటిష్టమైన నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం వుందని, ముఖ్యంగా పునరుత్పాదక రంగంలో ప్రపంచ ఉత్తమ విధానాలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
దేశ జనాభా అనేది చరిత్రాత్మక డెవిడెండ్ అని ప్రధాని అన్నారు. దానిని కోల్పోవడానికి వీల్లేదన్నారు. భారత యువతకు సరైన అవకాశాలను కల్పించేందుకు వారి నాణ్యమైన విద్య, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగాలన్నారు.వ్యవసాయం, స్టార్టప్ సైన్స్ ఇలా అనేక రంగాలలో నారీ శక్తి భాగస్వామ్యం పెరుగుతోందని, భారత్ అభివృద్ధి ప్రయాణంలో మహిళల పూర్తి శక్తిని వినియోగించుకోవాలని కూడా పిలుపునిచ్చారు.








