నవవిధ భక్తి మాధుర్యంతో వరవీణ మ్యూజిక్ అకాడమీ అన్నమ స్వరార్చన
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా
ఈ శనివారం మధ్యాహ్నం యథావిధిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం వరవీణ మ్యూజిక్ అకాడమీ శిష్యబృందం భక్తిశ్రద్ధలతో అన్నమ స్వరార్చన నిర్వహించారు.
కాగా, తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం వరవీణ మ్యూజిక్ అకాడమీ గురువు శ్రీమతి శాంతి చంద్రిక గారి మార్గదర్శకత్వంలో శిష్యులు ఆధ్య, అపర్ణ, శ్రీ వర్ధని, అభీష్ట, నివృత్తి, కైవల్య, సాన్వి, సాత్మిక, భవిష్య, శ్రీనిధి, చిన్మయి, శ్రీకారి, శ్రీమతి దుర్గా చెన్నూరి, శ్రీమతి ఎం. మధు, శ్రీమతి ఆర్. పద్మజ, శ్రీమతి డి. వరుణి, శ్రీమతి సరస్వతి, కుమారి డి. అక్షిత, కుమారి పి. శ్రేయ, కుమారి కె.వి. అద్వైత, కుమారి కె.వి. అక్షిత, కుమారి కె. మానస్విని, కుమారి రుత్విక తదితరులు సంయుక్తంగా నవవిధ భక్తి రూపాలను ప్రతిబింబించే అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. శ్రవణ భక్తిగా “నీ కథామృతము”, అర్చన భక్తిగా “షోడశ కళానిధికి”, స్మరణ భక్తిగా “హరినామము కడు ఆనంద”, వందన భక్తిగా “అదివో చూడరో”, పాదసేవగా “బ్రహ్మ కడిగిన పాదము”, కీర్తన భక్తిగా “చాలదా హరినామ”, సఖ్య భక్తిగా “పెంచ బేంచ మీద”, దాస్య భక్తిగా “నీ దాస్య మొక్కటే”, ఆత్మనివేదనగా “ఆకటి వేళల అలపైన” అనే సంకీర్తనలను శ్రుతి–లయ సమన్వయంతో ఆలపించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ స్వరార్చనకు మృదంగంపై వి. విజయ్ కిరణ్ గారు, వీణపై కుమారి దివ్య గాయత్రి, కంజీరపై మాస్టర్ కె. అనంత్ కశ్యప్ వాయిద్య సహకారం అందించి గానానికి మరింత మాధుర్యం చేకూర్చారు.
ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు అన్నమయ్య సంకీర్తనలలో ప్రతిఫలించిన నవవిధ భక్తి విశిష్టతను వివరిస్తూ, భక్తి మార్గంలో సంగీతం ఆత్మను దైవంతో అనుసంధానించే శక్తిగా నిలుస్తుందని తెలిపారు. గురువు శ్రీమతి శాంతి చంద్రిక గారు శిష్యులను భక్తి, సాహిత్య భావం, శ్రుతి, లయ సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయమని అభినందించారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న గాయకులు, వాద్య కళాకారులకు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో సాగిన అన్నమ స్వరార్చన కార్యక్రమం భక్తి, సంగీత మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.








